తెలుగులో సీక్వెల్స్ హిట్టయిన దాఖలాలు చాలా తక్కువ. బాహుబలి 1, 2 వచ్చాయి కానీ అవి సీక్వెల్స్ కావు. కేవలం కొనసాగింపు మాత్రమే. కేజీఎఫ్ కూడా అంతే. శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్టయితే, శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయ్యింది. అయినా అప్పుడప్పుడూ సీక్వెల్ పరంపర కొనసాగిస్తున్నారు దర్శకులు. ఇప్పుడు కార్తికేయ – 2 వస్తోంది. నిఖిల్ – చందూ మొండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ మంచి విజయాన్ని అందుకొంది. ఆ ఉత్సాహంతోనే పార్ట్ 2 తీశారు.పార్ట్ 1 కథకూ, పార్ట్ 2 కథకూ సంబంధం ఉండదు. కేవలం పాత్రలు కొనసాగుతాయి. శనివారం ఈ సినిమా విడుదల అవుతోంది.
అన్నీ కుదిరితే.. పార్ట్ 3 కూడా తీస్తానని చందూ మొండేటి చెబుతున్నాడు. కార్తికేయ అనే పాత్రని ఎన్నిసినిమాలైనా చేయొచ్చని, ప్రేక్షకులు ఆదరించేంత వరకూ.. ఈ పరంపర కొనసాగుతుందని చందూ చెప్పాడు. అంటే కార్తికేయ 2 హిట్టయితే, పార్ట్ 3కి మార్గం సుగమం అయినట్టే. కార్తికేయ పై అప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. నిర్మాణ వ్యయం కూడా తక్కువే. కార్తికేయ 2 అలా కాదు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ లాంటి స్టార్ కాస్టింగ్ తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ భారీగా ఉన్నాయి. బడ్జెట్ బాగా పెరిగింది. కాబట్టి.. రిటర్న్స్ ఎలా ఉంటాయో చూడాలి. పార్ట్ 3 అనుకొన్నా, ఇప్పుడే మొదలయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. చందూ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. ఇప్పటికే గీతా ఆర్ట్స్ చందూకి అడ్వాన్స్ ఇచ్చింది. ఆ తరవాత నాగార్జునతో ఓ సినిమా చేస్తాడు. ఆ సినిమాకి సంబంధించిన కథ కూడా రెడీ అయిపోయింది.