పబ్లిసిటీ పలు రకాలు. సినిమాలో ఏముందో చెప్పి జనాల్ని థియేటర్లకు రప్పించుకోవడం. లేదంటే ఎవరినో ఒకర్ని తిట్టి, కాంట్రవర్సీ సృష్టించుకుని ప్రచారం కల్పించుకోవడం. మూడో రకం కూడా ఉంది. ఓ స్టార్ హీరోని అదే పనిగా పొగిడి ఆ హీరో ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడం. నిన్నా మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ పేరుని అలా వాడుకునేవారు. ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చినట్టుంది. మొన్నటికి మొన్న ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్‌ఫంక్షన్ లో చిరుని చూసి నిఖిల్ ఊగిపోయాడు. గొంతు పోయేలా.. మెగాస్టార్ మెగాస్టార్ అంటూ అరిచేశాడు. ‘నేను చిరంజీవి ఫ్యాన్’ అనే విషయాన్ని బలంగా జనంలోకి వెళ్లేలా చేశాడు. నిఖిల్ మాటల ప్రభావమో ఏమో.. ఈ సినిమాకి బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇప్పుడు కార్తికేయ కూడా అదే మంత్రం జపిస్తున్నాడు. తన కొత్త సినిమా `90 ఎం.ఎల్` ఈవారమే విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇటు చిరునీ, అటు మహేష్‌ని పొగిడే కార్యక్రమంలోకి దిగాడు. చిరంజీవి వల్లే సినిమాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చిందని, చిరు, మహేష్ లే తన దృష్టిలో నిజమైన హీరోలని కొనియాడాడు. నిజానికి అక్కడ చిరు, మహేష్‌లను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పనిగట్టుకుని మరీ వాళ్ల పేర్లు గుర్తు చేశాడు. చిరు, మహేష్ పేర్లెత్తగానే ఆడిటోరియంలో హోరు మొదలైంది. అయితే అవి మాత్రమే టికెట్లు తెంచలేవు. ‘ఆర్.ఎక్స్ 100’ తరవాత కార్తికేయకు హిట్టు పడలేదు. హిప్పీ ఫ్లాప్ అయ్యింది. ‘గుణ 369′ నీ ఎవరూ పట్టించుకోలేదు. గ్యాంగ్ లీడర్ కోసం విలన్‌గానూ మారాడు గానీ, ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ’90 ఎం.ఎల్’ తో హిట్టు కొట్టి జనాల్ని ఆకర్షించడం తప్పనిసరి అయిపోయింది. పైగా ఈ సినిమాని తన సొంత బ్యానర్లోనే నిర్మించాడు. అందుకే… ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.