ఓ సినిమా సామాన్యుడిని సైతం హీరో చేసేస్తుంది. సెలబ్రెటీగా మార్చేస్తుంది. స్టార్ స్టేటస్ కట్టబెట్టేస్తుంది. అందులో వ్యక్తి గొప్పదనం కంటే, సినిమా చేసే మ్యాజిక్కే ఎక్కువ. అలాంటి మ్యాజిక్కి ఉదాహరణ.. కార్తికేయ. ఆర్.ఎక్స్ 100తో ఒక్కసారి వెలుగులోకి వచ్చేశాడు. ఇప్పుడు తన చేతినిండా బోలెడన్ని సినిమాలు. ఆర్.ఎక్స్ మామూలు హిట్టు కాదు. ఎవ్వరూ ఊహించినది. ఇలాంటి హిట్టొస్తే… కిక్ వేరే రేంజులో ఉంటుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాకపోతే… కార్తికేయని చూస్తే.. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ అయ్యిందా అనిపిస్తుంది.
కార్తికేయ హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కార్తికేయని చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. అతని మాటలు వింటే… `ఏంటి ఇంతలా మాట్లాడేస్తున్నాడు` అనిపిస్తుంది. మా సినిమా హిట్టవుతుంది. సూపర్ హిట్ అవుతుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. అలా చెప్పకపోవడం తప్పు. కానీ కార్తికేయ మాత్రం `ఆర్.ఎక్స్ లాంటి సినిమా కావాలా? దానికి డబుల్ కావాలా? త్రిపుల్ కావాలా? పది రెట్ల సినిమా కావాలా.. ఇస్తున్నాను తీసుకోండి` అంటూ కాస్త ఓవర్ గా మాట్లాడాడు. ఆర్.ఎక్స్ లాంటి సినిమా మరోటి వస్తే కార్తికేయ కూడా స్టార్ అయిపోతాడు. అందులో డౌట్ లేదు. దానికి పది రెట్ల సినిమా ఇస్తాను తీసుకోండి.. అన్నాడంటే ఆ సినిమాని మనం ఏ రేంజులో ఊహించుకోవాలి? ఒక్క సినిమాతోనే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందన్న భ్రమలో ఉన్నాడు కార్తికేయ. `మీ వల్లే నేనిలా ఉన్నాను` అంటూ పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడతారే… అలా మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.
ఈ సినిమా పూర్తవ్వగానే మీరు కూడా నాలా షర్టులు తీసి, గిరి గిర తిప్పండి. ఆ ఫొటోలు మాకు పంపండి… ట్రెండ్ చేద్దాం అని పిలుపు ఇచ్చాడు. ఈ వారం రోజుల్లో సిక్స్ ప్యాక్‌లు పెంచుకోండి.. నాలా టాటూలూ వేసుకోండి అంటూ సలహాలు ఇచ్చాడు. పెద్ద పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే.. ఇలా మాట్లాడరు. అలాంటిది కార్తికేయ ఒక్క సినిమాకి ఇలా రెచ్చిపోతున్నాడేంటి చెప్మా?? అనిపించింది వాళ్లందరికీ. అన్నట్టు మరో సంగతి.. ఈ స్టేజీ ఎక్కిన అతిథులంతా ఎంతసేపు మాట్లాడారో కార్తికేయ ఒక్కడే అంతసేపు మాట్లాడాడు. దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించాడు. స్టేజీపై స్టెప్పులు వేశాడు. తన చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూసించేశాడు. మొత్తానికి కార్తికేయ ఇప్పుడు మేఘాల్లో ఉన్నాడన్న విషయం అర్థమైంది. హిప్పీ సినిమా తనని ఆకాశంలోకి తీసుకెళ్తుందో. నేల మీద దించేస్తుందో చూడాలి. సినిమాలు హిట్టవ్వొచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. కాకపోతే… ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అవసరం లేదు. ఈ విషయాన్ని కార్తికేయ గుర్తు పెట్టుకోవాలి.