ఆర్.ఎక్స్ 100తో ఓ కెరటంలా వచ్చిపడ్డాడు కార్తికేయ. ఆ సినిమా చూశాక… చిన్న, ఓ మోస్తరు నిర్మాతలూ, దర్శకులు తమకు ఓ మంచి ఆప్షన్ దొరికిందనుకున్నారు. కానీ – ఇప్పుడు ఆ కార్తికేయే వన్ సినిమా వండర్లా తయారవుతున్నాడనిపిస్తోంది. హిప్పీ, గుణ 369 సినిమాలు వరుసగా పల్టీలుకొట్టాయి. ఇప్పుడు `90 ఎం.ఎల్` పరిస్థితీ అలానే తయారైంది.
కుర్రాడిలో ఎనర్జీ ఉంది. కానీ దాన్ని సరైన తీరితో వాడుకోవడం లేదనిపిస్తోంది. కథల ఎంపికలో చాలా తప్పులు చేస్తున్నాడు. అయితే ఈ తప్పంతా తనదే అనడానికి వీల్లేదు. కార్తికేయ కథలు వినే బాధ్యతని తన బాబాయ్‌కి అప్పగించాడు. బాబాయ్ `ఎస్` అంటే `ఎస్…`… `నో` అంటే `నో`. హిప్పీ, గుణ, ఎం.ఎల్ ఈ కథలన్నీ బాబాయ్ ఓకే చేసివవే. మాస్ హీరోగా అర్జెంటుగా ఎదిగిపోవాలన్న తాపత్రయంలో ఉన్నాడు కార్తికేయ. అదే తన కెరీర్‌కి ప్రధానమైన ఇబ్బంది. తన వయసున్న హీరోలు ఎలాంటి కథలు ఎంచుకుంటున్నారు? తనకు ఎలాంటి కథలు నప్పుతాయి? అనే విషయంలో కార్తికేయకు స్పష్టత లేకుండా పోయింది. డాన్సులు, ఫైటింగులు, మాస్ సీన్లు.. ఇవే హీరోయిజం అనుకుంటున్నాడు. ఈ భ్రమల్లోంచి బయటకు రావాలి. అప్పుడు తప్ప మంచి కథలు తన చేతికి రావు. బాబాయ్కో, మేనేజర్ కో కథలు వినే బాధ్యత అప్పగించడం కాకుండా, తనే కథలు విని – అసలు ఎలాంటి కథలు తనని వెదుక్కుంటూ వస్తున్నాయో తెలుసుకోవాలి. ముందు కాస్త బ్రేక్ తీసుకుని, తప్పులెక్కడ జరిగాయో తెలుసుకోవాలి. తనకు బోలెడంత కెరీర్ ఉంది. ఇప్పటికీ కార్తికేయతో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి ఆలోచించి అడుగేయాలి. మరో ఫ్లాపు పడిందంటే – అదే ఆఖరి మజిలీ అనుకోవాలి.