ధాన్యం సమయానికి కొనుగోలు చేయలేదని ఓ రైతు గోడు వెళ్లబోసుకుంటే… దానికి నేనేం చేస్తానురా ఎర్రిపప్ప అని తిట్టేసి వెళ్లిపోయిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాను రైతును ఎర్రిపప్ప అన్నమాట నిజమే కానీ.. అది తిట్టు కాదని కొత్త అర్థం పట్టుకొట్టారు. ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అని అర్థమని.. అర్థం చెప్పారు. ఆయన మాటలు వైరల్ కావడంతో కవరింగ్ చేసుకోమని కూలి మీడియాను ఆయన దగ్గరకు పంపారు. ఆ కవరింగ్ ఎలా చేసుకోవాలో ఆయనకు చెప్పలేదులా ఉంది.
గతంలో సీఎం జగన్ .. బోస్ డీకే అన్న మాటను పట్టుకుని ఎలా తనకు ఇష్టం వచ్చిన అర్థాన్ని తీసుకుని ఎలా రచ్చ చేసుకున్నారో అలా ఎర్రిపప్ప అనే పదానికి కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీసుకున్నారు. రైతును తిట్టలేదని.. బుజ్జి నాన్న అని మాత్రమే అన్నానని అంటున్నారు. మంత్రి నాగేశ్వరరావు తెలుగు అర్థం చెప్పి అందరి కళ్లు తెరిపించారని ఇప్పుడు అందరూ ఆయనను ఎర్రిపప్ప కారుమూరి నాగేశ్వరరావు అనడం ప్రారంభించారు. అదేమంటే.. ఆయన చెప్పిన అర్థం ప్రకారం బుజ్జి నాన్న నాగేశ్వరరావు అని అర్థం చేసుకోవాలంటున్నారు. కారుమూరి చెప్పిన అర్థం.. ఒక్క ఆయనకే కాదు వైసీపీ మొత్తానికి వర్తిస్తుందని సోషల్ మీడియాలో అందరికీ అదే పదం తగిలించి మాట్లాడటం.. సంబోధించడం ప్రారంభించారు.
పట్టాభి సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్ డికే అని విమర్శించారు. అది తననే అన్నారని సీఎం జగన్ తన వాళ్లకు బీపీ వచ్చేలా చేసి టీడీపీ ఆఫీసుల మీదకే కాదు అందరిపై దాడులు చేయమని ప్రోత్సహించారు. మా వాళ్లకు బీపీ వచ్చిందని ఆయనే చెప్పుకొన్నారు. తర్వాత బోస్ డీకేకు ఓ బూతు అర్థాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. నిజానికి బోస్ డీకే అనేది సాధారణ పదమేనని.. జగన్ చెప్పిన అర్థం లేదని ఎప్పుడో తేలింది. కానీ వారనుకున్నారు కాబట్టి అదే అర్థం… ఇప్పుడు ఎర్రిపప్ప అనేదానికి కూడా వారనుకున్నదే అర్థం. కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు మరి.