ఎన్నికల్లో పోటీ చేయించి.. తన కుమారుడ్ని ఎమ్మెల్యేను చేయాలని టీటీడీ సొమ్మును ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారుడిపై అనర్హతా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధించే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం ఎంపీ ఎన్నికల సమయంలో జరిగిన దొంగ ఓట్ల స్కామే.
తిరుపతిలో లోక్ సభ ఉపఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారులను ఏమార్చి.. వారి పేర్లతో 30వేల ఓటర్ కార్డులను డౌన్ లోడ్ చేశారు. వాటి ద్వారా ఫేక్ ఓటర్ ఐడీలను సృష్టించారు. ఈ స్కాంపై ఈసీ చాలా సీరియస్ అయింది. ఇప్పటికే ఓ ఐపీఎస్ సహా పలువురు అధికారుల్ని సస్పెండ్ చేసింది. ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. పాత్రధారులు కాదు.. సూత్రధారుల్ని గుర్తించాలన్న లక్ష్యంతో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ వన్ గా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లుగా అందరికీ తెలుసు. ఇప్పుడు పోలీసులకు సాక్ష్యాలు కూడా దొరికినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లోనే అన్ని వ్యవహారాలూ ఉన్నాయి. అందుకే పోలీసులు కాస్త నెమ్మదిగా ఉన్నారు. ఎన్నికల కోడ్ రాగానే ఒక్క సారిగా దూకుడు పెంచుతారని.. ఈసీకి చెందిన కేసు కాబట్టి… పూర్తి వివరాలు బయట పెడతారని..అంటున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న భూమన అభినయ్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని.. ఆయనపై అనర్హతా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. అనర్హతా వేటు వేస్తే.. ఖచ్చితంగా దేవుడు శిక్ష వేసినట్లే.