డి.ఎం.కె. అధినేత కరుణానిధి ఎన్నికల లెక్కలు చెప్పారు. అంటే డబ్బు లెక్కలు కాదు ఓట్ల లెక్కలు. 176 స్థానాలలో పోటీ చేసిన మా పార్టీకి 41.05 శాతం ఓట్లు పోలవగా, మొత్తం 232 స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన అన్నాడిఎంకె పార్టీకి 40.78శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. గత ఎన్నికలతో పోల్చుకొంటే ఈసారి డి.ఎం.కె.కి 36.61 లక్షల ఓట్లు అదనంగా వచ్చేయి కానీ అన్నాడిఎంకెకి 14.64 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల తరువాత డి.ఎం.కె.కి కేవలం 23 మంది మాత్రమే శాసనసభ్యులు ఉంటే ఈసారి ఎన్నికలలో వారి సంఖ్య 89కి పెరిగింది. గత ఎన్నికలలో అన్నాడిఎంకె 150సీట్లు గెలుచుకోగా ఈసారి కేవలం 134సీట్లు మాత్రమే గెలుచుకొందని కరుణానిధి గుర్తు చేశారు. అంటే రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీ సభ్యుల సంఖ్య తగ్గగా, ఆ మేరకు ప్రధాన ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరగడాన్ని అందరూ గుర్తించాలని అన్నారు.
అన్నాడిఎంకె అభ్యర్ధులకు రెండు నియోజక వర్గాలలో 100 కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో, 8 నియోజక వర్గాలలో 101-1000లోపు మెజార్టీతో, 21 చోట్ల 1001-5000 మెజార్టీతో, 22 చోట్ల 5001-10,000 మెజార్టీతో గెలవడం గమనిస్తే అధికార పార్టీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచినట్లు అర్ధమవుతోందని కరుణానిధి అన్నారు. గెలుపోటముల మధ్య ఇంత స్వల్పమైన తేడా ఉండటం ఏ ఇతర ఎన్నికలలో చూడలేమని అన్నారు.
అధికార అన్నాడిఎంకె అన్ని స్థానాలలోనూ పోటీ చేయడం, ప్రతిపక్ష డి.ఎం.కె. పార్టీ పొత్తుల కారణంగా కాంగ్రెస్ తదితరులకి 40 సీట్లు వదిలిపెట్టడం వలననే కరుణానిధి చేతికి విజయం చిక్కినట్లే చిక్కి చేజారిపోయింది. ఈ గణాంకాలు ఇప్పుడు వల్లె వేసుకొన్నా అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులలో ఎటువంటి మార్పు రాదూ. కానీ ఎన్నికలలో ఓడిపోయిన డి.ఎం.కె.కి అవి ఒక గుణపాఠంగా పనికివస్తాయి. ఎన్నికలలో విజయం సాధించిన అన్నాడిఎంకె పార్టీ వాటిని ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఈ ఓటమి కారణంగా 93 ఏళ్ల వయసులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కరుణానిధి కలలు కరిగిపోయాయి. తన ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్ రాజకీయ జీవితం సుస్థిరం చేయాలనే ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి. తత్ఫలితంగా పార్టీలో ఇద్దరు కొడుకుల మద్య మళ్ళీ ఆధిపత్య పోరు మొదలయితే దాని వలన పార్టీకి ఇంకా నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉంది.