తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బక్కని నరసింహులను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎల్.రమణ టీ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన తర్వాత.. పూర్తిగా టీ టీడీపీ కార్యక్రమాలు ఆగిపోయాయి. బక్కని నరసింహులును నియమించినా… క్యాడర్‌ను కదిలించలేకపోయారు.
గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన కాసాని జ్ఞానేశ్వర్.. ఇటీవలి కాలంలో సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి చేరుతారని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి ఈటల, హరీష్ రావు చర్చలు జరిపారు. అయితే కాసాని మాత్రం అనూహ్యంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ పలువురు బీసీ నేతలను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగు పరుస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్‌తో పాటు ఖమ్మం వంటి చోట్ల మంచి ఫలితాలు వచ్చేందుకు కాస్త కష్టపడే.. మంచి నాయకులు ఉంటే చాలన్న వాదన వినిపిస్తూండటంతో… కాసానికి కొత్త బాధ్యతలు ఇవ్వడం.. చర్చనీయాంశమవుతోంది.