బాహుబలి సంచలనచిత్రమే గాని జాతీయ ఉత్తమ చిత్రం ఎలా అయిందనే చర్చ 63వ సినిమా అవార్డులు ప్రకటించిన రోజు నుంచి జరుగుతూనే వుంది. ప్రముఖ కన్నడ సమాంతర దర్శకుడు, అవార్డుల గ్రహీత గిరిష్ కాసరవల్లి ఆ విమర్శలను మరింత సూటిగా వినిపించారు. విజయవంతమైన వినోదాత్మక చిత్రాలకు అవార్డులు ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. అయితే బాహుబలిలో అణగారిన తెగలను ఉపేక్షిత తరగతులను చూపించేప్పుడు వుండాల్సిన సున్నితత్వం లేదని కాసరవల్లి విమర్శించారు. వారిని అనాగరికంగా చూపడం సరికాదన్నారు. అలాటి కాలం దాటి చాలాదూరం వచ్చేశామని కాసరవల్లి స్పష్టం చేశారు. ఆ చిత్రంలో దాడి చేసిన కాలకేయులను నల్లగా వికారంగా చూపించి అర్థం కాని భాష పెట్టడం, ప్రభాస్‌ను పెంచిన గిరిజన తెగల ప్రజలను కూడా వెనకబడినవారిగా చూపించడం, కట్టప్పను బానిసగానే అట్టిపెట్టడం వంటివి బహుశా ఆయన దృష్టిలో వుండొచ్చు.
బాహుబలికి అవార్డు ఇవ్వడం ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రాంతీయ భాషల్లో వచ్చిన చిత్రాలు అనేక సమస్యలను సృశించినా పట్టించుకోకుండా దాన్ని ఎంపిక చేశారని ఆ కన్నడ దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు పొందిన కన్నడ చిత్రాల నిపుణులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది అవార్డులు పొందిన మరో కన్నడ దర్శకుడు పి.శేషాద్రి ఇదే సభలో మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం తప్ప బాహుబలిలో మరేమీ లేదని వ్యాఖ్యానించారు. జమున నుంచి గిరీష్ కాసరవెల్లి వరకూ( ఈ వ్యాఖ్యత వంటివారితో సహా) చేసిన స్నేహపూర్వక విమర్శలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి రాబోయే భాగంలోనైనా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారని ఆశించవచ్చునా?