కార్తి నటించిన కాష్మోరాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్.. అందులో కార్తి గెటప్పులు అబ్బుర పరుస్తున్నాయి. అయితే ఈ సినిమాని బాహుబలితో పోల్చుకొని చూడడం, ఆ స్థాయిలో ఉంటుందేమో అని అంచనాలు పెంచుకోవడం చిత్రబృందాన్ని కలవర పాటుకు గురి చేస్తున్న విషయం. అందుకే కార్తి వీలున్నప్పుడల్లా.. ”బాహుబలితో మా సినిమాని పోల్చొద్దు” అంటూనే ఉన్నాడు. అలా చెబుతూనే… బాహుబలికీ, కాష్మోరాకి లింకు కలిపి మాట్లాడుతున్నాడు. అంతే కాదు.. ఇప్పుడు మగధీరనీ కలిపేశాడు. బాహుబలి చూశాక.. కాష్మోరా గ్రాఫిక్స్ డిజైన్ చేయించామంటున్నాడు కార్తి. అంతేకాదు.. మగధీరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లా ఇందులోనూ ఓ పిరియాడికల్ ఎపిసోడ్ ఉంటుందని, ఆ ఎపిసోడ్‌లోనే తాను కాష్మోరాగా కనిపిస్తానని అంటున్నాడు. అటు బాహుబలి గ్రాఫిక్స్, ఇటు మగధీర ఫ్లాష్ బ్యాక్ రెండింటినీ మిక్స్ చేసేశారన్నమాట.
అయితే విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రం కాష్మోరా టీమ్ బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపుగా 90 నిమిషాల సీన్లు గ్రాఫిక్స్‌తో నిండిపోయాయట. 25 కంపెనీలకు ఇచ్చి ఆ గ్రాఫిక్ పనులు పూర్తి చేశారట. క్లైమాక్స్ దృశ్యాల్లో మాత్రం విజువల్ వండర్ అంటే ఏమిటో ఆవిష్కరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో దాదాపుగా 1800 షాట్స్ ఉన్నాయట. ఈ సినిమా కోసం ఏకంగా 19 సెట్స్ వేశారని చిత్రబృందం చెబుతోంది. కార్తి మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రెండు పాత్రలు ఆల్రెడీ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. మూడో పాత్ర ఏమిటి? ఎలా ఉంటుందన్నది తెరపైనే చూడాలట. మేకప్ కోసమే ప్రతీ రోజూ 5 గంటలు వెచ్చించాల్సివచ్చిందని కార్తి చెబుతున్నాడు. మరి ఈ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే ఈనెల 28 వరకూ ఆగాలి. కాష్మోరా అప్పుడే విడుదల అవుతుంది.