బాహుబలి.. తెలుగు చిత్రసీమకే కాదు. యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకూ ఓ బెంచ్ మార్క్‌లా నిలిచిన చిత్రం. ఇక నుంచి చారిత్రక చిత్రాలకూ, విజువల్ ఎఫెక్ట్స్ నిండిన కథలకూ ఆ సినిమానే కొలమానంగా నిలవబోతోంది. ప్రేక్షకులు కూడా ఇక మీదట ఏ సినిమా వచ్చినా బాహుబలితో పోల్చుకొంటారు. కాష్మోరా ట్రైలర్, అందులో కార్తి గెటప్పు ఎప్పుడు బయటకు వచ్చిందో.. అప్పటి నుంచీ ఈ సినిమాకీ బాహుబలికి పోలికలు తీస్తున్నారు. అది కార్తిని భయపెడుతోంది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం కాష్మోరా. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళికి విడుదల అవుతోంది. ఇదో హిస్టారికల్ థ్రిల్లర్. హారర్ అంశాలూ ఉన్నాయి. పునర్జన్మల ప్రస్తావన, యుద్ద సన్నివేశాలూ ఉన్నాయి.
యుద్దం అనగానే.. ఇప్పుడు అందరికీ బాహుబలి గుర్తొస్తుంది. కాష్మోరా ప్రచార చిత్రాల్లో చూపించిన కొన్ని షాట్స్.. బాహుబలి వార్ సీక్వెన్స్‌కి నకలుగా అనిపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో కార్తికి భయం పట్టుకొంది. తమ సినిమాని బాహుబలితో పోల్చవొద్దని, ఆ సినిమా డైనోసర్ అయితే మాది కుక్కపిల్ల అంటూ కామెంట్ చేస్తున్నాడు కార్తి. బాహుబలి ఓ బెంచ్ మార్క్ సినిమా అని, ఆ కళ్లతో కాష్మోరాని చూడడం అన్యాయమని, తమదో చిన్న ప్రయత్నం అని విన్నవించుకొంటున్నాడు. కార్తి సవినయంగా ఇది చిన్న ప్రయత్నం అని చెబుతున్నా.. ట్రైలర్ మాత్రం భారీగానే ఉంది. జోనర్ వేరైనా.. బాహుబలి స్థాయిలోనే ఖర్చు పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో విజువల్స్ కూడా కళ్లు చెదిరేలానే ఉన్నాయి. అయితే బాహుబలితో పోల్చుకొని థియేటర్లలోకి అడుగుపెడితే కొంప కొల్లేరవ్వడం ఖాయం. అందుకే… కార్తి తెలివిగా ముందుగా తన సినిమాకి లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తున్నాడు. సినిమా ఏమాత్రం బాగున్నా ఎక్కేయడం ఖాయం. అదే బాహుబలిలా ఉంటుందేమో అని అనుకొన్నప్పుడు ఏమాత్రం తగ్గినా.. లెక్కలు తేడాలొచ్చేస్తాయి. కార్తి భయం కూడా అదే మరి.