సినిమా బిజినెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాకి సంబంధించిన ప్రతీ అంశం ఒక వ్యాపారమే. సినిమా విడుదలయ్యాక అందులో వాడిన బళ్లు, బట్టలు, కత్తులు, ఆయుధాలూ వేలానికి వేసేవారు. ఇప్పుడు.. విడుదలకు ముందే బ్రాండింగ్ మొదలెట్టారు. కాటమరాయుడు విషయంలో అదే జరుగుతోంది. పవన్ కల్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ ఏం చేస్తే.. అదే చేయడానికి లక్షలాది అభిమానులు రెడీగా ఉన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సమయంలో ఎర్ర తువాళ్ల కు మంచి గిరాకీ వచ్చింది. అభిమనులంతా ఎర్ర తువాళ్లనే తమ డ్రస్ కోడ్ గా భావించారు. ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని కాటమరాయుడ టీమ్ భావిస్తోంది. కాటమరాయుడు విడుదలకు ముందే కాటమరాయుడు టీషర్ట్స్, తువాళ్లని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఆన్లైన్ ద్వారా.. తక్కువ రేట్లకు టీషర్ట్స్, తువాళ్లని అమ్మడానికి సన్నాహాలు చేస్తోంది.
అంతేకాదు.. కాటమరాయుడు ఆడుతున్న థియేటర్ల దగ్గర ప్రత్యేక స్టాళ్లు ఓపెన్ చేస్తారట. అక్కడ టీషర్ట్స్ అమ్మకానికి పెడతారట. అలా.. కాటమరాయుడు బ్రాండింగ్ని మొదలెట్టేసింది చిత్రబృందం. ఇదో రకమైన వ్యాపారం. రేపొద్దుట.. పవన్ కల్యాణ్ ప్రజా సభల వేదికల దగ్గర ఇలాంటి బ్రాండింగ్లను అమ్ముకోవొచ్చు. జనసేన టీషర్టులకు అక్కడ గిరాకీ బాగా ఉండొచ్చు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అని ఊరకే అన్నారా!