సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి పెరిగింది. సర్దార్తో నష్టపోయిన డిస్టిబ్యూటర్ల కోసం ఈ సినిమా తీస్తున్నాడు కాబట్టి.. ఈసారి కాస్త సేఫ్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కాటమరాయుడు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఎలాగైనా సరే… కాటమరాయుడుని ఓ సేఫ్ప్రాజెక్ట్గా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందుకే… ఎప్పటికప్పుడు తీసిన సీన్లు చెక్ చేసుకొంటున్నాడట. తాజాగా రషెష్ చూసిన పవన్ కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడని, ఆ సన్నివేశాల్ని మళ్లీ కొత్తగా రాయించి రీషూట్ చేయించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.
కాటమరాయుడు సినిమాకి ఇద్దరు సంభాషణ రచయితలు పనిచేశారు. వాళ్ల స్థానంలో మరో రచయితని తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడట. ఆ రచయిత చేతికి స్ర్కిప్టు ఇచ్చి మార్పులు చేయమని సూచించాడట. కొత్త రైటర్ ఇచ్చిన సన్నివేశాల్ని బట్టి… సీన్లు మళ్లీ తీయాలా, లేదంటే చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుందా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఉగాదికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది యూనిట్ ప్లాన్. రీషూట్లు ఎక్కువైతే అప్పటికి రావడం కష్టం. అయినా పవన్ డోండ్ కేర్ అంటున్నాడట. ”సినిమా బాగా రావాలి. ఎప్పుడు సంతృప్తి లభిస్తే అప్పుడే విడుదల చేద్దాం. టార్గెట్ లేవీ పెట్టుకోవొద్దు” అని టీమ్‌కి సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది.