టాలీవుడ్లో దీపావళి వెలుగులు మొదలైపోయాయి. ఫస్ట్ లుక్ల నజరానాతో అభిమానుల్ని ఖుషీ చేసేస్తున్నారు హీరోలంతా. చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ వీళ్లంతా తమ సినిమాల్లోని లుక్కుల్ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు.చ ఇప్పుడు పవన్ కూడా వీళ్లతో టీమ్ అప్ అయ్యాడు. పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం.. కాటమరాయుడు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. శరత్ మరార్ నిర్మాత. కాటమరాయుడులోని పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. దీపావళి సంబరాల్ని గుర్తు చేస్తూ పవన్, శ్రుతి దీపాలు వెలిగిస్తున్నారు. లుక్ మరీ కేక పెట్టించలేదు గానీ… దీపావళి కదా.. దానికి తగ్గట్టుగా ట్రెడీషనల్గా ఉంది.
గత రెండ్రోజుల నుంచీ కాటమరాయుడు సినిమా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా సెట్లోంచి పవన్ అలిగి వెళ్లిపోయాడని, శరత్ మరార్ సర్ది చెప్పే పనిలో నిమగ్నమయ్యాడని వార్తలొచ్చాయి. ఈ హడావుడిలో లుక్ గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఎలా ఉండబోతోంది? అనేది పట్టించుకోలేదు. సాధారణంగా పండగలకు లుక్ లు ఇవ్వడం పవన్‌కి ఇష్టం ఉండదు. అందుకే కాటమరాయుడు లుక్ గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. అలాంటప్పుడు సడన్ సర్ప్రయిజ్ ఇచ్చాడు పవన్. లుక్ ఎలా ఉన్నా.. అందులో పవన్ ఉన్నాడు కాబట్టి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.