ఈనాడు సంస్థకు తెలుగు భాష, సాహిత్యం పట్ల అపేక్ష. ఈనాడు పత్రిక, ఈటీవీ అచ్చ తెలుగు వైభవాన్ని చాటడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి. ఆ సంస్థ నుంచి వచ్చిన ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది.
ఈటీవీ విన్ లో ‘కథాసుధ’ పేరుతో ఓ సిరిస్ ప్రారంభం కానుంది. ప్రతి ఆదివారం ఒక కథని ప్రసారం చేస్తారు. తొలి సీజన్ సిద్ధం అయ్యింది. రాఘవేంద్రరావు సూపర్ విజన్ లో నాలుగు కథలు, సతీష్ వేగ్నేష పర్యవేక్షణలో ఓ ఐదు కథలని చిత్రీకరించారు. కొత్తవారితో పాటు తనికెళ్ళ భరణి, బాలాదిత్య లాంటి పేరిన్నిక గల నటులు కూడా ఈ కథల్లో నటించారు.
వాణిజ్యపరంగా ఇది ఎంత లాభసాటో తెలీదు. తెలుగు సినిమా, సాహిత్యానికి తమ వంతు తోడ్పాటుగా వుంటుందని ఈ సిరిస్ ని మొదలుపెట్టినట్లుగా ఈటీవీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో చాలా మంచి కథలు వున్నాయి. మంచి కథాబలం వున్న కొత్త కథలకు కూడా అవకాశం వుంటుంది. ఆసక్తి వున్నవారు కథలతో సంప్రదించాలని ఈవిన్ సంస్థ కోరుతోంది. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న దర్శక రచయిత నటీనటులకు కథాసుధ మంచి వేదికనే అనే చెప్పాలి.