కథలంటే సమాజాన్ని, మనుషుల్ని అక్షరాల్లో కుదించడమే.
ఒక కథలో మీరు.. ఇంకో కథలో నేను.. మరో కథలో మన పక్కింటివాళ్లు కనిపిస్తూనే ఉంటాం.
కొన్ని కథలు చదదివినంత సేపు బాగుంటాయి.
ఇంకొన్ని కథలు చదివాక ఓ ఆలోచన రేకెత్తిస్తాయి.
అరుదైన కథలు… జీవితాంతం వెంటాడతాయి. అందుకే కథ అవసరం.
తెలుగు పత్రికలు సాహిత్యానికి పెద్ద పీట వేసినా, వేయకపోయినా, ప్రతీ ఆదివారం మాత్రం ఓ కథను క్రమం తప్పకుండా అందిస్తున్నాయి. అలాంటి కథల్ని ఒక చోటకు చేర్చి, విశ్లేషిస్తోంది తెలుగు 360. ఈ వారం (జులై 14) వచ్చిన కథలు. వాటి పరిశీలన ఇది.
కథ: వరుడు కావలెను
రచన: వాణీశ్రీ
పత్రిక: ఈనాడు
”మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి” అనే డైలాగ్ ఉంది ఈ కథలో. అది ఎంత నిజమో… పాత కాలం నాటి కథల్నీ మళ్లీ వండి వార్చే ప్రయత్నం చేయకూడదన్నది అంతే నిజం. అత్తింట్లో ఆడబడుచుల ఆర్తనాదాల్లాంటి కథలు వినీ, చదివి పాఠకుల కళ్లు అలసిపోయాయి. అలాంటి కథనే ‘వరుడు కావలెను’లో మళ్లీ వినిపించారు రచయిత్రి. పెళ్లి, జీవిత భాగస్వామి విషయంలో అమ్మాయిలకు ఎన్నో భయాలు, అపోహలు ఉంటాయి. వాటి నేపథ్యంలో సాగే ఓ రొటీన్ కథ ఇది. అమ్మ, అక్క చెళ్లెళ్లు లేని సంబంధమే చేసుకొంటానని ఓ అమ్మాయి మొండిపట్టుదలకు పోవడమే ఈ కథ. అలాంటి అమ్మాయికి ఎలాంటి అబ్బాయి దొరకాడన్నది ‘వరుడు కావలెను’ చదివితే తెలుస్తుంది. దీన్నో కామెడీ కథలా నడిపి ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నమూ చేయలేదు. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ వరకూ బాగుంది. రెండు పేజీల్లో ఈ కథ ముగించడం ఇంకా బాగుంది.
కథ: బతుకు మచ్చలు
రచన: పాలగిరి విశ్వ ప్రసాద్
పత్రిక: ఆంధ్రజ్యోతి
ఇదో బతుకు వ్యధ. పులివెందుల సబ్ జైల్ లో మొదలైన కథ. అక్కడ దొంగలు, సెంట్రీకీ మధ్య జరిగిన సంభాషణతో కథ మొదలవుతుంది. కులం, జాతి మనుషుల్ని ఎలా ఏకం చేస్తుంది? వాళ్లలో ఎక్కడో మారు మూల దాక్కున్న మంచితనాన్ని ఎలా వెలికి తీస్తుంది? అనేది రచయిత అక్షరాల్లో కనిపిస్తుంటుంది. నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది. కథ మొదలెడితే చివరి వరకూ చదివించే శక్తి కథనానికి ఉంది. చివరి పేరా చదివితే దొంగలపై కూడా ఓరకమైన సానుభూతి కలుగుతుంది. కొన్ని కథలకు రకరకాల పార్శ్వాలు ఉంటాయి. ఒకొక్కరి కోణంలో కథ ఒక్కోలా అర్థం అవుతుంటుంది. ‘బతుకు మచ్చలు’లో కూడా ఆ లక్షణం ఉంది.
కథ: నవ్వుతున్న బుద్ధుడు
రచన: బాడిశ హనుమంతరావు
పత్రిక: సాక్షి
బిడ్డ పుట్టగానే పేరు కోసం కాదు, ఆ పక్కన పెట్టే డిగ్రీ కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎల్కేజీ నుంచే లాంగ్ టర్మ్ కోచింగ్. మైదానానికి వెళ్లి ఆడుకోవాల్సిన బాల్యం కాస్త… ఈ టార్గెట్ ఓరియెంటెడ్ కోర్సుల్లో మునిగి తేలడానికే సరిపోతుంది. ఈ వైనాన్ని చాలా కథలు ఇప్పటికే చెప్పేశాయి. ఈ కథలో రచయిత.. హాస్యానికి పెద్ద పీట వేశారు. చెప్పాలనుకొన్న మాట సుతి మెత్తగా చెప్పారు. పాత్రలకు రమణీ, రాంబాబు అనే పేర్లు పెట్టడంతోనే రచయిత సెన్సాఫ్ హ్యూమర్ అర్థమైపోతుంది. కథ చదువుతునప్పుడు ఓ సూర్యకాంతాన్ని, ఓ రమణారెడ్డిని ఊహించేసుకొంటాం. టాపిక్కు పాతదే. దానికి హ్యూమర్ జోడించడం ప్లస్ అయ్యింది. టైటిల్ కీ కథకూ సంబంధం ఏమిటా అనేది చివరి పేరా వరకూ తెలీదు. క్లైమాక్స్ లో ‘నవ్వుతున్న బుద్ధుడు’ టైటిల్ ని డీ కోడ్ చేశారు.
కథ: పొట్టి గుట్టలు
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
పత్రిక: నమస్తే తెలంగాణ
అపురూపంగా పెంచుకొన్న మేకను కాపాడాలనుకొని తాపత్రయపడిన ఓ పసివాడి హృదయం ఈ కథ. దేవుళ్ల పేరుతో జీవ హింస చేసి, ఆకలి తీర్చుకొంటున్న మనబోటివాళ్లందరినీ కదిలించే కథే ఇది. కథ ఎటువైపు వెళ్లబోతోందన్న విషయం పాఠకుడి ఊహకు అందుతూనే ఉంటుంది. కాకపోతే.. ఆ వర్ణన, మేకను రక్షించడానికి ఆ పసివాడు చేసే ప్రయత్నం ఆకట్టుకొంటాయి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిసరాలను కళ్లకు కట్టేట్టు అక్షరాల్లోకి తీసుకురావడంలో రచయిత సక్సెస్ అయ్యారు. ముగింపు హృద్యంగా ఉంది.
కథ: ఉన్నది ఒకటే జీవితం
రచన: తాళ్లూరి లక్ష్మి
పత్రిక: వెలుగు
డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెప్పే కథ ఇది. పొట్ట నింపుకోవడానికి న్యాయబద్ధంగా చేసే ఏ పనీ తప్పు కాదు. చదివిన చదువుకీ, చేస్తున్న పనికీ పొంతన లేకపోవొచ్చు. కానీ.. చేసే పనిలో సంతృప్తి ఉంటే – డిగ్రీలు అడ్డు రావు. జీవితంపై విలువ చెబుతూ, పనిపై ప్రేమ పెంచేలా సాగిన కథ ‘ఉన్నది ఒకటే జీవితం’. ఈ కథలో స్పీచులు దంచికొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది కథకు అవసరం అని అనిపిస్తుంది కూడా.