ప్రతీవారం చాలా కథలు పుట్టుకొస్తుంటాయి. దిన పత్రికలన్నీ ఆదివారం పూట ఓ కథని ప్రచురితం చేయడం ఆనవాయితీగా మారింది. ఆ కథల్ని సూక్ష్మంగా పాఠకుడికి పరిచయం చేయడమే ‘కథాకమామిషు’ ఉద్దేశ్యం. కథని పాఠకుడి వరకూ చేర్చడానికి ఇదో ప్రయత్నం మాత్రమే. కథలోని అంశాల్ని కొద్ది కొద్దిగా వివరిస్తూ, ఆ రుచుల్ని పాఠకుడికి చేరేలా చేయడమే లక్ష్యం. ఇలాగైనా కథకు కొత్త పాఠకులు దొరుకుతారని ఓ చిన్న ఆశ. దాంతో పాటు కథలు రాస్తున్నవాళ్లకు ప్రోత్సాహకంగా ఉంటుందని మా ఆలోచన. ఈవారం (జనవరి 5) వివిధ పత్రికల్లో వచ్చిన కథల్ని పరిచయం చేస్తున్నాం. పూర్తి కథలు చదవాలంటే ఆయా పత్రికల్ని తిరగేయాల్సిందే.
కథ: ప్రేమకథ
రచన: గోగినేని మణి
పత్రిక: ఈనాడు
ఈనాడు కథల్లో ఎక్కువగా మానవత్వం, మంచితనం పరిమళిస్తుంటాయి. ‘ప్రేమకథ’ కూడా అదే జాబితాలో చేరిపోతుంది. అందం శరీరానికి సంబంధించింది కాదని, మనసుకూ వ్యక్తిత్వానికీ సంబంధించినదని చెప్పే కథ ఇది. యావరేజ్ గాఉండే ఓ అమ్మాయిని కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకొంటాడు ఓ అందమైన అబ్బాయి. అక్కడితో ఆగడు. భార్యకు సేవలు కూడా చేస్తుంటాడు. అసలు ఇలాంటి అమ్మాయిని బతిమాలి, బుజ్జగించి మరీ కోడలుగా ఎందుకు తీసుకొచ్చాడో ఆ తల్లికి అర్థం కాదు. దాని వెనుక ఉన్న కథేమిటో రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడు? ఈ ప్రేమకథకు ప్రారంభం ఎక్కడ జరిగింది? అనే అంశాల చుట్టూ ఈ కథని నడిపారు రచయిత్రి. కథనం సాఫీగా సాగిపోయింది. చివర్లో ఓ ట్విస్టు కూడా ఉంది.
కథ: గుండ్లకమ్మ నీడలు
రచన: అజయ్ ప్రసాద్
పత్రిక: సాక్షి
సాధారణంగా దిన పత్రికలు కథ కోసం 3 పేజీలు కేటాయిస్తాయి. ఈ కథ నాలుగు పేజీలుంది. కొన్ని కథలు పరిధిని దాటుకొని విస్తరిస్తాయి. వాటిని కుదించలేం. కాకపోతే.. ఈ కథని ఇంకాస్త షార్ప్ గా చెప్పొచ్చు. రచయిత ఆ పనిచేయలేదు. కనీసం ఎడిటర్ అయినా చేసి ఉండాల్సింది. ఇప్పుడు కథలోకి వెళ్దాం.
ఇది కథ అనడం కంటే – స్మశాన వైరాగ్యం అనొచ్చు. ఓ వ్యక్తి తొలి సారి తాను చూసిన స్మశానాన్ని గుర్తు చెబుతూ చెప్పిన మాటలూ, అతని అనుభవాలు. స్మశానం చాలా చెబుతుంటుంది. ఒకొక్కరికీ ఒక్కోలా కనిపిస్తుంది. ఓ మాస్టారుకి స్మశానం ఎలా కనిపించిందో, చిన్నప్పటి సంఘటన లో ఆవిష్కరిస్తాడు రచయిత. కథలో సంభాషణలు తక్కువ. వర్ణన ఎక్కువ. చివర్లో సైతాను గురించి చెబుతూ, దోస్తయేవ్స్కీ అనే ఫిలాసఫర్ కోట్ ని గుర్తు చేస్తాడు రచయిత. బహుశా.. ఈ కథతో తాను చెప్పదలచుకొన్న పాయింట్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. స్మశానం ఒకొక్కరికీ ఒక్కోలా కనిపించినట్టు, ఈ కథ ఒకొక్కరికీ ఒక్కోలా అర్థం అవుతుందేమో..?!
కథ: పారిజాతం
రచన: ఇందూ చంద్రన్
పత్రిక: సాక్షి (యువకథ)
సాక్షి ఈమధ్య ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. యువ రచయితల్ని ప్రోత్సహిస్తోంది. ‘యువ కథ’ పేరుతో ఓ శీర్షిక నిర్వహిస్తూ ఔత్సాహిక రచయితలూ, రచయిత్రులకూ ఓ వేదిక కల్పిస్తోంది. ఈవారం యువకథగా ‘పారిజాతం’ వచ్చింది.
మనిషికి చివరి దశలో కావల్సింది జ్ఞాపకాలే. ఒక పెద్ద మనిషికి అవే చెల్లాచెదురైపోతున్న వేళ.. ఒక్కొక్క జ్ఞాపకం ఏరుకొంటూ తన చిననాటి ప్రేమకథని గుర్తు చేసుకోవడమే ఈ కథ. ఇందూ చంద్రన్ శైలి బాగుంది. కథనం హాయిగా సాగిపోయింది. చివర్లో ఓ మంచి ఫీల్. యువతరం రచయితలు తమ కథల్లో ఎక్కువగా మోడ్రన్ థాట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లు చూస్తున్న సొసైటీని, కలుస్తున్న మనుషుల్ని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కథలో మాత్రం ఆనాటి ఎమోషన్స్‌కి పెద్ద పీట వేయడం ఆహ్వానించదగిన పరిణామం.
కథ: అలౌకికం
రచన: తులసీ బాలకృష్ణ
పత్రిక: నమస్తే తెలంగాణ
కొన్ని బంధాలు ఎందుకు మొదలవుతాయో, ఎప్పుడు అంతమవుతాయో చెప్పలేం. ఒకసారి చేయి అందుకొంటే – ప్రాణం పోయేంత వరకూ ఆ బంధానికి కట్టుబడి ఉండిపోవడం అందరికీ సాధ్యమయ్యే సంగతి కాదు. ప్రేమలో తెగింపు ఎంత అవసరమో, త్యాగం, బాధ్యత కూడా అంతే అవసరం. అలా ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యతగా మసులుకొనే ఓ మంచి మగాడి కథ ఇది.
అలౌకికం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే – భార్య చివరి కోరిక నెరవేర్చడానికి ఓ భర్త చేసిన ప్రయత్నం. అయితే ఇలా సింపుల్ గా ఈ కథ గురించి చెప్పినా, మాటల్లో చెప్పలేనంత ఎమోషన్ ఈ కథలో రంగరించారు తులసీ బాలకృష్ణ. భార్యాభర్తల బంధాన్ని, భార్యపై భర్యకున్న బాధ్యతని అక్షరాల్లో అమర్చారు. పతాక సన్నివేశంతో కళ్లు చెమ్మగిల్లేలా చేశారు. ఈ భారమైన ముగింపు కొంత సేపటి వరకూ పాఠకుడి మనసుపొరల్లోంచి పోదు. చదివి చూడండి. మీకే తెలుస్తుంది.
– అన్వర్