ఓ వైపు బెంగళూరులో ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కదలాడుతూండగానే.. హైదరాబాద్‌లోనూ అలాంటి అలజడి రేపడానికి కత్తి మహేష్ ప్రయత్నించారు. బెంగళూరు ఘటనల తర్వాత మంత్రి కేటీఆర్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా.. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. కత్తి మహేష్ అలాంటి చిచ్చు పెడితేనే తన గురించి చెప్పుకుంటారని అనుకున్నారేమో కానీ పోస్టులు పెట్టారు.
గతంలోలా రాముడ్ని విమర్శిస్తూ… సోషల్ మీడియాలో విద్వేషం చిమ్మారు. దీంతో వెంటనే.. కత్తి మహేష్‌ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి..రిమాండ్‌కు తరలించారు. బెంగళూరు కన్నా హైదరాబాద్ ఇంకా సున్నిత ప్రాంతం. గతంలో కత్తి మహేష్ ఇలా రాముడిపై చేసిన హడావుడితో… పరిపూర్ణానంద స్వామి పోటీకి వచ్చారు. ఇద్దర్నీ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.
ఆ తర్వాత కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా.. ఇప్పుడు ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్న సందర్భంలో మరోసారి అలాంటి పోస్టు పెట్టారు. కేవలం అల్లర్లు రెచ్చగొట్టే ఉద్దేశతోనే..కుట్రతోనే కత్తి మహేష్ ఈ పోస్టు పెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా చానళ్లలో పబ్లిసిటీ పొందే.. కత్తి మహేష్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న సూచనలు అందుతున్నాయి.