పవన్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు, నటుడు మహేశ్ కత్తి ఇటీవల దాదాపు ప్రతిరోజూ పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఉండటం తెలిసిందే. అయితే ఈ సారి మరింత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. సమస్యలు, భావజాలాలు అంటూ నిన్న మొన్నటి దాకా క్లాస్ గా విమర్శిస్తూ వచ్చిన కత్తి మహేష్ ఇప్పుడు ఇక దూకుడు పెంచి ఉన్మాదపు సేన, తిక్క సేనాని అంటూ తీవ్ర పదజాలం తో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే…
ఒక మహిళ తాను పవన్ కళ్యాణ్ సభ కి వెళ్ళి అక్కడ చేదు అనుభవానికి గురైనట్టు ఆ సభలో మహిళలకి రక్షణ లేనట్టు వివరిస్తూ ఒక వీడియో చేసారు. దానికి స్పందిస్తూ కత్తి మహేష్ ఇలా పోస్ట్ చేసారు – ‘ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ లోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు? పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళల్లారా… తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి’ అంటూ మహేశ్ కత్తి పిలుపునిచ్చారు.
అలాగే కత్తి మహేష్ ఒక టివి డిబేట్ లో మాట్లాడుతూ – కులాల మధ్య ఐక్యత రావాలని పవన్ పిలుపునివ్వడాన్ని ఆక్షేపించారు. “కులాల మధ్య ఐక్యత రావాలంటూ కమ్మ కాపు కులాలని ప్రస్తావించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ఉద్దేశ్యాన్ని బయట పెట్టుకున్నారు. సినీ రంగాన్ని ఆ రెండు కులాలు ఆక్రమించినట్టే రాజకీయ రంగాన్ని కూడా ఆ రెండు కులాలే ఆక్రమించుకోవాలనే దురుద్దేశ్యం ఆ ప్రకటన వెనక దాగి ఉంది” అని వివరించారు. అయితే ఈ వివరణ చూసిన ప్రేక్షకులకి కత్తి మహేష్ వైసిపి పార్టీ కి మద్దతు గా ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడేమో అన్న అనుమానాలు కొంతవరకు వచ్చాయి.
ఏది ఏమైనా ప్రజాస్వామ్యం లో ఎవరికి ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఉంది. అందులోనూ రాజకీయ నాయకులని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. అయితే ఆ హక్కుని వినియోగించుకుంటూ విమర్శించే క్రమం లో రోజు రోజుకీ విమర్శల డొస్ పెంచుకుంటూ, అందులో ఆవేశపు మోతాదు పెంచుకుంటూ పోతే చివరికి ఆ “డొస్” పని చేయకుండా పోవడమో లేక వికటించడమో జరుగుతుంది. బహుశా “విమర్శకులకి” ఈ విషయాలు ఆల్రెడీ తెలిసే ఉండాలి!!