పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ముగించుకుని , నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ సభలకి జనాలు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. అయితే నిన్న నెల్లూరులోని బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కావలి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ ను ప్రకటించారు. పసుపులేటి సుధాకర్ సమక్షంలో దాదాపు 20 వేల మంది నిన్న జనసేన పార్టీలో చేరారు. దీంతో ఎవరీ పసుపులేటి సుధాకర్ అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. కర్నూలు సభలో మాట్లాడుతూ, కొన్ని కుటుంబాల్లో జిల్లా రాజకీయాలను మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను శాసిస్తున్నాయని, అలాంటి కుటుంబాలను మళ్లీ తాను తన పార్టీలో చేర్చుకుంటే ప్రయోజనం ఉండదని చెప్పిన పవన్ కళ్యాణ్, నెల్లూరు లో కూడా ఇవే వ్యాఖ్యలను రిపీట్ చేశాడు. వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా చేతల్లో కూడా , నెల్లూరు రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాలను కాదని కొత్తవారిని తెర మీదకు తీసుకుని వస్తున్నాడు. ఇంతకీ ఎవరీ పసుపులేటి సుధాకర్ ?
చిన్న స్థాయి నుంచి రియల్ ఎస్టేట్ అధినేత దాకా:
పసుపులేటి సుధాకర్ , హైదరాబాద్ లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని. 40 రూపాయల దినసరి వేతనం తో జీవితాన్ని ప్రారంభించి, అంచలంచలుగా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించానని, ఆయన చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ లో లాభాలు గడించడం మాత్రమే కాకుండా, తమ సొంత నియోజకవర్గంలో చాలా కాలం నుండి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం లోని పాత బిట్రగుంట లోని హైస్కూల్ ను దత్తత తీసుకుని దాదాపు కోటి రూపాయలు దానికి విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఈటీవీ తదితర వార్త ఛానల్స్ లో దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ వేశారు. కేవలం విరాళం ఇవ్వడం మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన బిల్డింగులు స్వయంగా దగ్గరుండి కట్టించడం, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయించడం, సొంతంగా తామే కంప్యూటర్ సంబంధించిన ఫ్యాకల్టీని పాఠశాలలో నియమించి తామే జీతం ఇవ్వడం లాంటివి చేస్తూ వచ్చారు. అలాగే బిట్రగుంట లోని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కూడా భారీగా విరాళం ఇచ్చారు. అదీ కాకుండా నియోజకవర్గంలోని మత్స్యకారులతో మత్స్యకారుల పిల్లలకు తన ఖర్చులతో చదువు చెప్పిస్తున్నారు.
ఇండిపెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటే జనసేన నుండి ఆఫర్:
ఈ సామాజిక కార్యక్రమాలు అన్నీ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, కావలి నుండి సుధాకర్ ని పోటీ చేయించడానికి పవన్ కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి అయితే పసుపులేటి సుధాకర్ కూడా, 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లన్ని చేసుకున్నారు. ప్రచార రథాలు సైతం సిద్ధం చేసుకుని దాదాపు రెండు నెలలుగా నియోజవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి సుధాకర్ , తమ వర్గం అండ తో పాటు, మత్స్యకారుల అభిమానం, తను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడే అన్నారు. అయితే అనూహ్యంగా జనసేన నుండి ఆఫర్ రావడంతో, మారు ఆలోచించకుండా జనసేన పార్టీలో చేరిపోయారు. తాను చేరుతూనే తనతో పాటు దాదాపు 20 వేల మందికి పైగా తన కార్యకర్తలను జనసేన పార్టీలో ఈయన చేర్పించారు.
టిడిపి వైఎస్ఆర్సిపి ల మధ్య 2014లో హోరాహోరీగా జరిగిన నియోజకవర్గం:
ఇప్పుడు తన సొంత బలానికి తోడు, జనసేన పార్టీ బలం, పవన్ కళ్యాణ్ అభిమానుల బలం తోడవడంతో ఖచ్చితంగా గెలుస్తాం అని పసుపులేటి సుధాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్ సీపీకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బీద మస్తాన్ రావు మీద స్వల్ప మెజారిటీతో ప్రతాప్ రెడ్డి 2014లో గెలిచారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఒక్క రెండు శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓట్ల తేడా వచ్చింది. ఇలా ఈ రెండు పార్టీలు ఇంత బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి గా పసుపులేటి సుధాకర్ ఎంతవరకు రాణిస్తాడు, ఏ మేరకు విజయం సాధిస్తాడు అన్నది ఎన్నికలయ్యాక తెలుస్తుంది.
– జురాన్ ( @CriticZuran)