తెలంగాణా తెదేపాకు ఎల్.రమణ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ ఆయన తెరాసను ధీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయలేకపోవడంతో ఆయన స్థానంలో రేవంత్ రెడ్డిని నియమిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆశ్చర్యకరంగా ఎల్.రమణని అధ్యక్షుడుగా కొనసాగిస్తూ రేవంత్ రెడ్డిని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఎల్.రమణ ఎలాగూ రేవంత్ రెడ్డి అంత దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు కనుక పేరుకి ఆయన అధ్యక్షుడయినప్పటికీ పెత్తనం అంతా రేవంత్ రెడ్డిదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు రేవంత్ రెడ్డినే అధ్యక్షుడుగా ఎందుకు నియమించలేదు అంటే బహుశః ఓటుకి నోటు కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న ఆయనని పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనే కావచ్చును. అయినా కూడా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు.
నిజామాబాద్ ఎంపీ కవిత వరంగల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా ద్రోహుల పార్టీగా ఉండే తెదేపా తెలంగాణా వచ్చిన తరువాత తెలంగాణా దొంగల పార్టీగా మారింది. ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడమే అందుకు మంచి ఉదాహరణ. నైతిక విలువలు లేనివారికి అటువంటి కీలక పదవిని కట్టబెట్టి తమది ఎటువంటి పార్టీయో ప్రజలకు తెలియజేసారు చంద్రబాబు నాయుడు,” అని అన్నారు.
రాజకీయ నేతలు నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే అది విని ప్రజలు నవ్వు కొంటున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. అందుకు ఆయనని ఎవరు పంపించారో… ఎందుకు పంపారో అందరికీ తెలుసు. తెదేపాకు తన ఎమ్మెల్సీని గెలిపించుకోనేంత మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ నామినేటెడ్ ఎమ్మెల్యేని ఎందుకు ప్రలోభపెట్టవలసి వచ్చిందో అందరికీ తెలుసు. తెరాస ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ నేటికీ కొందరు కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలుగా నిసిగ్గుగా కొనసాగుతున్నారని అందరికీ తెలుసు. అలాగే ఓటుకి నోటు కేసులో నుండి తెదేపా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని ఏవిధంగా బయటపడిందో కూడా అందరూ చూసారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కి ఎవరు పాల్పడ్డారో అందరూ చూసారు. ఇన్ని అనైతిక చర్యలకు పాల్పడిన రాజకీయ పార్టీలు తామేదో అగ్ని పునీతులు అన్నట్లుగా నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకోక ఏమి చేస్తారు.
ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆ తెలంగాణా ద్రోహుల పార్టీ నుండి వచ్చిన వారేనని కవిత మరిచిపోయినట్లున్నారు. ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో పాల్గొననివారు, తెలంగాణా అనే పదం కూడా ఉచ్చరించని వారు ఇప్పుడు తెరాసలో చేరి ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే ఉద్యమం కోసం పోరాడినవారు నేటికీ గుర్తింపు కోసం పోరాడవలసి వస్తోంది. కనుక కవిత లేదా మరొక రాజకీయ నాయకుడు ఎవరయినా సరే అద్దాలమేడలో కూర్చొని ఎదుట వాళ్ళ మీద రాళ్ళు విసిరే ముందు బాగా ఆలోచించుకోవడం మంచిది.