ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ తనకు సమయం కావాలని ఆమె రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. పదిహేనో తేదీ తర్వాత హాజరవుతానని చెప్పారు. దీనిపై ఈడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేదు. ఈడీ నోటీసులు జారీ అయిన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు.
అంతకు ముందు .. ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని.. మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కేసీఆర్ కవితకు సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని… భారత రాష్ట్ర సమితి.. పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత కవిత ఢిల్లీ బయలుదేరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది . ఈ దీక్ష కోసమే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈడీ స్పందించకపోతే కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తే కేసు క్లిష్టంగా మారుతుంది. అయితే ఈడీ స్పందించి.. గడువు ఇస్తే.. మహిళా రిజర్వేషన్ల అంశంపై ధర్నా తర్వాత ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.
ఒక వేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే తెలంగాణలో భారీ ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తమ మద్దతుదారులైన ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతోనే నిరసనలు చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు.