హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ వేడుకల పేరుతో వసూళ్ళు దండుకుని దిగమింగేశారన్న ఆరోపణలపై తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. బతుకమ్మ వేడుకలు లెక్కలు కావాలంటే జాగృతి వెబ్సైట్లో ఉన్నాయని, ఎవరైనా పరిశీలించొచ్చని చెప్పారు. మహారాష్ట్రలో నాడు బాలగంగాధర తిలక్ వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన స్ఫూర్తితో 2007-08లో తాను బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు మొదలుపెట్టానని అన్నారు. చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆ బతుకమ్మ పండగను ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఉద్యమకాలంలో ఈ వేడుకలను ఆపకుండా జరపటానికిగానూ ఒక్కో సంవత్సరం సొంత బంగారాన్నికూడా తాకట్టుపెట్టి బతుకమ్మను నిర్వహించామని అన్నారు.
కవిత ఇవాళ హైదరాబాద్‌లో బంగారు బతుకమ్మ పోస్టర్, సీడీలను ఆవిష్కరించారు. వరసగా తొమ్మిదోఏట రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాక 12నుంచి మొదలయ్యే వేడుకలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తామని చెప్పారు. చివరిరోజైన ఈనెల 20న హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలను జరపనున్నట్లు వెల్లడించారు.