ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత …నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి తెర వెనుకే ఉన్నారు. ప్రజల్లోకి రావాల్సిన అవసరం కనిపించలేదు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి ..మళ్లీ చట్టసభ సభ్యురాలు అవ్వాలనుకున్నారు. కానీ కరోనా అడ్డం పడింది. ఇవాళ కాకపోతే..రేపైనా ఆమె ఎమ్మెల్సీ అవుతారు. అయితే.. అనూహ్యంగా గతంలోలా ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం ఇప్పుడు ఆమెకు లభించింది. దీంతో ఆమె రాజకీయంగా ఇక యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తిరుగులేని అధికారం టీఆర్ఎస్కు ఉంది…ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు…కానీ కేంద్ర నిర్ణయాలపై చేసే అవకాశం ఉంది.
ఎంపీ కాకపోయినా.. ఆమెకు అవకాశం లభిస్తోంది. కేంద్రం ఇటీవల బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ కూడా ఓ భాగం. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. సింగరేణిలో కార్మికులు ఉద్యమాలు ప్రారంభించారు. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు దగ్గరనుంచి గుర్తింపు సంఘంగా మార్చే వరకూ..కవిత కృషి చేశారు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే.. ఎన్నికలకు ముందు..అన్ని కార్మిక సంఘాల గౌరవఅధ్యక్ష బాధ్యతల నుంచి టీఆర్ఎస్ నేతలను వైదొలగాలని కేసీఆర్ ఆదేశించారు.
అప్పుడు రాజీనామా చేశారు.కానీ ఇప్పుడు అదే హోదాలో ఆందోళనలకు సిద్దమయ్యారు. టిబిజికేఎస్ నాయకులతో సమావేశమై….ఉద్యమానికి నేతృత్వం వహించాలని కోరారు. దానికి కవిత అంగీకరించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ వద్ద జరిగే కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలి హోదాలో కవిత పాల్గొననున్నారు. టిఆర్ఎస్ అనుబంధ టిబిజికేఎస్ లో ఇటీవల వర్గ పోరు ఎక్కువైంది. దాంతో కార్మికుల్లో ఆదరణ కోల్పోతోంది. ఇప్పుడు మళ్లీ కవిత ఎంట్రీతో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది.