కేసీఆర్ కుమార్తె … నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మరోసారి నిజామాబాద్‌లోనే అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆమె నిజామాబాద్‌లో మరోసారి పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీని గురి పెట్టి… పసుపుబోర్డు అస్త్రంగా విమర్శలు ప్రారంభించారు. తాను మళ్లీ నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగబోతున్నానని సంకేతాలు పంపారు.
పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా ఎలాంటి బోర్డు తీసుకు రాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడిక్కకడ అడ్డుకుంటామని కవిత ప్రకటించారు. పసుపు బోర్డు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి గారిని కలిశామని.. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులనూ కలిశామన్నారు. వారి మద్దతు కూడా పొందామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టామని గుర్తు చేశారు. 2015 లోనే స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ను పెట్టామని… 2017 లోనే డివిజనల్ ఆఫీస్ పెట్టామని పత్రాలను విడుదల చేశారు. పసుపు రైతులకు అవసరమైన బాయిలర్లను పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీగా అందించామన్నారు.
కానీ ఇప్పుడు ఎంపీ అరవింద్ అవన్నీ తానే చేశానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాల కోసం అరవింద్ తెచ్చింది ఒక్కో రైతుకు రూ. 300 మాత్రమేనన్నారు. ఆర్టీఐ ద్వారా తాను ఆ వివరాలను సేకరించానన్నారు. మూడేళ్లు ఓపిక పట్టినం ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. బోర్డు తెచ్చే వరకు ఇక్కడి కక్కడ అడ్డుకుంటాం ..జిల్లా ప్రజలకు ఎంపి సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకున్న కవిత మళ్లీ మనసు మార్చుకుని ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని టీఆర్ఎస్ వర్గాలు ఓ క్లారిటీకి వచ్చాయి.