చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఆయనకు వచ్చిన సానుభూతి రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. కానీ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మాత్రం టెన్షన్ పెడుతోంది. చంద్రబాబుతో సంబంధం లేకపోయినా… కవితను కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం. సుప్రీంకోర్టు ఇచ్చిన పది రోజుల గడువు తర్వాత కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఒక వేళ కవితను అరెస్ట్ చేస్తే… పెద్ద ఎత్తున ప్రజల్లో సానుభూతి వస్తుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే రేవంత్ రివర్స్ ఆరోపణలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ తన బిడ్డ కవితను జైలుకు పంపించేందుకూ సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. కవితను తీహార్ జైలులో పెట్టించేలా ప్రధాని మోడీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని.. తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని ఆయన అంటున్నారు.
అవినీతికి పాల్పడిన కేసీఆర్ సర్కారుపై ఇప్పటివరకు ఈడీ, సీబీఐ కాదు కదా.. ఈగ కూడా వాలలేదన్నారు. తెలంగాణలో భారీ అవినీతి జరుగుతుందంటూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా విమర్శిస్తున్నారే తప్ప.. ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్కు అనుచరుడని ఆరోపిస్తున్నారు. మొత్తంగా కవిత అరెస్టు జరిగినా…. ఆ సానుభూతి బీఆర్ఎస్ కు రాకుండా ఉండాలని రేవంత్ రెడ్డి ముందే ఆరోపణలు ప్రారంభించేశారు.