ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు సోదాలకే వస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి ఒక్క సారిగా పన్నెండు మంది అధికారులు వచ్చారు. సీఆర్పీఎఫ్ భద్రతతో వచ్చారు. స్థానిక పోలీసులకు కూడా సోదాలు ప్రారంభిచిన తర్వాతే సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే అందరి ఫోన్లను సీజ్ చేశారు. దాదాపుగా పదహారు ఫోన్లను సీజ్ చేశారు.
నాలుగు గంటల సోదాల తర్వాత కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చారు. తర్వాత ఢిల్లీకి తీసుకెళ్తున్నట్లుగా చెప్పారు. అప్పటికి ఏం జరుగుతుందో స్పష్టతకు వచ్చిన కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన కవిత ఇంటికి వచ్చారు. మొదట వారిని ఇంట్లోకి అనుమతించలేదు. తర్వాత అనుమతించారు. కవిత అరెస్టుపై కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో ఇంట్లోకి అనుమతించి సమాచారం ఇచ్చారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత న్యాయపరంగా తేల్చుకుంటామని ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.
కవిత ఇంట్లో సోదాలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయమై సమాలోచనలు చేశారు. కేవితను అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఊహించలేదు. ఎందుకంటే.. లిక్కర్ కేసు విషయంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో తెలిపారు. ఈ పిటిషన్ పరిష్కారమయ్యే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని గతంలో ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
అందుకే సోదాల గురించి తెలిసి కవిత ఇంటి వద్దకు వచ్చిన కవిత న్యాయవాది సోమా భరత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా? తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది. ఈ టైంలో ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు. కానీ ఈడీ అధికారులు అందరి అంచనాలను తలకిందులు చేశారు.