హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలోని ఇరు ప్రభుత్వాలమధ్య దాదాపుగా యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. విభజన జరిగిననాటినుంచి ప్రతి విషయంపైనా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ జుట్లు పట్టుకోవటం చూస్తూనే ఉన్నాము. ఈ విభజన విభేదాలు ఎప్పటికి ముగుస్తాయోనని ఇరురాష్ట్రాల ప్రజలూ బాధపడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలలో ఒకరు, సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన నిజామాబాద్ ఎంపీ కవిత ఒక మంచి సూచన చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ తమ హక్కులకోసం, ప్రయోజనాలకోసం కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కూ కేంద్రంనుంచి అన్యాయమే జరుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎన్నికలు జరగబోయే బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించటం చాలా రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉందని కవిత విమర్శించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. హైకోర్ట్ విభజన, ప్రాణహిత ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సాయం, ఏపీ నూతన రాజధానికి నిధుల విడుదలవంటి అనేక అంశాలలో కేంద్రంనుంచి కదలిక లేదని ఆరోపించారు. ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించుకోటానికి తెలంగాణ సిద్ధమని, ఏపీకూడా కలిసిరావాలని కోరారు. ఏపీకి ఇచ్చిన హామీలనుకూడా కేంద్రం అమలు చేయటంలేదని అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు మనోధైర్యం వీడొద్దని, హక్కులు సాధించేదిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకోసం ఎంతోమంది యువత ప్రాణాలు అర్పించారని, ఇప్పుడు ఏపీలోకూడా ప్రత్యేకహోదా డిమాండ్‌తో ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు కొట్లాడటంద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మహత్యలు వద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. నాడు తెలంగాణ తల్లులు పడిన దుఃఖాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంతోమంది తల్లుల్లో చూస్తున్నానని, ఒక మహిళగా తాను ఆ బాధలను అర్థం చేసుకోగలనని అన్నారు. రెండు రాష్ట్రాలపట్లా ప్రధాని అనుసరిస్తున్న వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చంద్రబాబు మౌనంగా ఉంటూ, రాష్ట్రానికి రావల్సిన హక్కుల విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవటం ఆ రాష్ట్రానికి శాపంగా మారుతోందని అన్నారు. విభజన సమస్యలలో కొన్ని రెండు రాష్ట్రాలూ చర్చలు జరిపితే పరిష్కారమవుతాయని చెప్పారు. గత ఏడాది ఇద్దరు ముఖ్యమంత్రులూ సమావేశమై కొన్ని అంశాలను చర్చించారని, రోడ్ మ్యాప్ కూడా తయారు చేశారని, మరోసారి ఇలాంటి సమావేశానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబుమాత్రం తెలంగాణకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో సమస్యల పరిష్కారానికి సిద్ధంకావటంలేదని విమర్శించారు.
ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలక నేతనుంచి ఇలాంటి మాటలు రావటం ఇదే మొదటిసారి. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. దీనికిగానూ ఆమెను అభినందించాల్సిందే. నిజంగానే కవిత సూచనను ఇరువురు చంద్రులూ పాటించి చర్చలకు కూర్చుంటే చాలా విభేదాలు పరిష్కారమవుతాయి.