లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లోనూ కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకం కనిపిస్తోంది. మార్చి పదిహేనో తేదీన అరెస్టు చేసినప్పటి నుంచి జైల్లో ఉన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కేసు అని బీఆర్ఎస్ నమ్ముతోంది. ఎన్నికలు అయిపోయినందున ఇక కవితను జైల్లో ఉంచాల్సిన అవసరం బీజేపీకి కూడా లేదని భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం వెనుక బీఆర్ఎస్ త్యాగం ఉంది. ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోటల్లా బీజేపీ విజయం సాధించింది. చివరికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ మూడో స్థానంతో సరి పెట్టుకుంది. బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి కోఆపరేషన్ ఇచ్చిన తర్వాత కవిత బెయిల్ విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదని భావిస్తున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో కవితను వరుసగా కలుస్తున్నారు. మొదట కేటీఆర్ .. ఆ తర్వాత మహిళా మంత్రులు కలిశారు. బెయిల్ వస్తుందని ధైర్యం చెప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైనా కేసులో ఇన్ని రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. డిప్యూటీ సీఎం సిసోడియాకు కూడా ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీ అనుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.. కానీ ఇప్పుడు రాజకీయంలో ప్రజాస్వామ్యం పాళ్లు పెరిగాయని అనుకోవచ్చు.