ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టి వేసింది. నిజానికి కవితకు బెయిల్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. కవిత లాయర్ల టీం కూడా ఈ అంశంపై ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. ఎందుకంటే చాలా నెలల కిందటే అరెస్ట్ అయిన సిసోడియా ఇంకా జైల్లో ఉన్నారు. ఢిల్లీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ కు ఇంకా బెయిల్ రాలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వారికి ఎంత పాత్ర ఉందో… కవితకు కూడా అంతే పాత్ర ఉందని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగా కోర్టుల్లో ఆధారాలు సమర్పిస్తున్నారు. ఇప్పుడు కవిత రెండు దర్యాప్తు సంస్తలను అరెస్ట్ చేశాయి. అంటే రెండు రకాల కేసుల్లోన బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులు కష్టమవుతుంది. ఎలా చూసినా కవితకు కింది కోర్టులో బెయిల్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు కవిత తరపు లాయర్లు ఢిల్లీ హైకోర్టుకు వెళ్తారా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తారా అన్నది కీలకం.
సుప్రీంకోర్టు ఇటీవల ఆప్ ఎంపీ ఒకరికి బెయిల్ ఇచ్చింది. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇదే తరహాలో బెయిల్ వస్తుందేమోనని కవిత ఆశలు పెట్టుకున్నారు. కానీ కింది కోర్టులో ఊరట లభించలేదు. ఇప్పటికే యాభై రోజులు అయింది. ఇంకా ఎన్ని నెలలు జైల్లో ఉండాలో స్పష్టత లేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె బయటకు రాదని మాత్రం ఓ స్పష్టత బీఆర్ఎస్ వర్గాలకు వస్తోంది.