ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మరికొద్ది గంటల్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. తన కుమారిడికి పరీక్షలు ఉన్నాయని… ఈ సమయంలో తాను తన కొడుకుతో ఉండటం అవసరమని ఈమేరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం… సోమవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ ను కూడా దాఖలు చేశారు కవిత. అయితే, ఈ పిటిషన్ పై ఈ నెల 20 న ఈడీతోపాటు కవిత తరఫు న్యాయవాదుల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె మధ్యంతర బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కోర్టు కవిత బెయిల్ ను తిరస్కరిస్తే.. మంగళవారం ఆమెను కోర్టు ముందు హాజరు పరచనున్నారు.
కవితకు నేడు బెయిల్ లభించినా ఆమెను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు న్యాయనిపుణులు. సీబీఐ విచారణకు కోర్టు నుంచి ఇప్పటికే అనుమతి తీసుకున్న సీబీఐ… ఆమెకు బెయిల్ లభించినా విచారణ పేరిట అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో