భారత జాగృతి నాయకురాలు.. కల్వకుంట్ల కవిత రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత అందుకున్న బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఓ సభను హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్కు సపోర్టుగా ఉండే బీసీ సంఘాలు.. పేపర్లపై ఉండే బీసీ సంఘాల ప్రతినిధుల్ని కొంత కాలంగా యాక్టివేట్ చేసిన కవిత మీడియా ముందు ఉద్యమం చేయిస్తున్నారు. మీటింగుల మీద మీటింగులు పెట్టి చర్చించారు. ఇప్పుడు మహాత్మా పూలే జయంతి సందర్భంగా ధర్నా చేయాలని నిర్ణయించారు. చేస్తున్నారు.
ఈ ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కాస్త హడావుడి చేశారు. కానీ పోలీసులు అంత చాన్స్ ఇవ్వలేదు. అనుమతి ఇచ్చేశారు. అయితే ఈ అంశంపై కవితకు చాలా ప్రశ్నలు ఎదురొస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు .. తొలి సారి స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి.. రెండో సారి స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎంత ఉన్నాయో చెప్పాలని అంటున్నారు. 34 శాతం ఉండే రిజర్వేషన్లను పద్దెనిమిదికి తగ్గించారు. దీనికి కారణం న్యాయపరమైన సమస్యలు. అయితే కవిత ఈ విషయం ప్రజలకు, ముఖ్యంగా బీసీ నేతలకు గుర్తుండని చెప్పి బీసీల కోసం రంగంలోకి దిగారు.
కేసీఆర్ తగ్గించిన రిజర్వే,న్లను తాము పెంచుతున్నామని అందుకే కులగణన చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ప్రక్రియ జరుగుతూంటే క్రెడిట్ కోసం కవిత ఇలాంటి పొలిటికల్ గేములు ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీలకు కేసీఆర్ చేసిన ద్రోహం.. కవిత జాగృతి కింద చేసే ఉద్యమాలో కప్పెట్టలేరని అంటున్నారు. అయితే రాజకీయం అంటే.. చేసిన తప్పుల్ని కూడా ఎదుటివారు చేశారని ధర్నాలు చేయడమే. కవిత కూడా అదే చేస్తున్నారు.