ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. ఆయనను కల్వకుంట్ల కవిత బినామీగా ఈడీ అధికారులు చెబుతున్నారు. నిజానికి మూడు రోజుల కిందటే సీబీఐ కేసుల్లో ముందస్తు బెయిల్ పిళ్లైకి వచ్చింది. కానీ ఇవాళ ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు కవిత కుటుంబంతో పాటు అభిషేక్ బోయినపల్లి కుటుంబం, అరుణ్ రాంచంద్ర పిళ్లై కుటుంబం వెళ్లారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ అరెస్టయ్యారు.
సీబీఐ, ఈడీలు చాలా పకడ్బందీగా కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. కానీ ప్రతీ చార్జిషీటు, అఫిడవిట్లో కవిత పేరు ప్రస్తావనకూ వస్తూనే ఉంది. సౌత్ లాబీ పేరుతో ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆమె బినామీలదేనని సీబీఐ అధికారులు చెబుతున్నారు. దీనిపై కవితను ఓ సారి మాత్రమే ప్రశ్నించారు. గతంలో అసలు తన పాత్రమే లేదని చెబుతూ వచ్చిన కవిత.. అరెస్టయిన వారు పరిచయస్తులని చెబుతున్నారు.
వారు తనకు తెలిసినంత మాత్రాన తన లిక్కర్ స్కాంతో సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలుగు మీడియా ముందు ఆమె తన వాదనలు వినిపిస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం కన్నా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే టెన్షన్ తోనే కవిత గడపాల్సి వస్తోంది. ఆమెను మానసికంగా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఇబ్బంది పెడుతోంది.