కాలు ఫ్రాక్చర్ అయిందని బయటకు రాని కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐలు కలిసి గట్టి షాకులిస్తున్నాయి. ఢిల్లీ కోర్టులో మేడే రోజున మూడో చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కవిత గురించే ప్రధానంగా చెప్పారు. కవిత ఎలా స్కాం చేశారు.. వచ్చిన డబ్బులతో ఎలా భూములు కొన్నారో కూడా వివరించడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.
ఆర్థిక లావాదేవీలపై కీలక అభియోగాలు మోపింది ఈడీ. చార్జ్ షీట్ లో కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె సన్నిహితుల పేర్లను చేర్చింది ఈడీ. చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు, కవిత సన్నిహితులు వి శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి పేర్లను చేర్చింది. చార్జిషీట్లో సాక్ష్యాలుగా వాట్సాప్ చాట్ లు , ఈ మెయిల్స్ కూడా జత చేసింది. ఇవన్నీ కవిత సమర్పించిన ఫోన్ల నుంచి రీట్రీవ్ చేశారో లేకపోతే చోట సేకరించారో కానీ.. పక్కా ఆధారాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లతోనే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.
కవిత బినామీగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. ఇటీవల ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యారన్న ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. అదే జరిగితే కవితను ఆర్థిక నేరాల విషయంలో గట్టి సాక్ష్యాలతోనే బుక్ చేసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓ వైపు జైల్లో ఉన్న సుకేష్ లేఖలు రాస్తున్నారు. మరో వైపు ఈడీ , సీబీఐ చార్జిషీట్లు వేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కవిత బయటకు రాకుండా గాయం పేరుతో మ్యానేజ్ చేస్తున్నారు. మరో వైపు ఈడీ ఆఫీసుకు పిలవకుండా.. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్నే ప్రత్యేక సిట్ తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్ పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. ఈ పరిణామాలతో.. కేసు నెమ్మదిగా సాగుతున్నా… ఆగిపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.