తనను జైలు పాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో సంపాదించినదంతా వడ్డీతో సలహా చెల్లిస్తానని చెప్పారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు ఆమె చెప్పింది వేరు. తనను రాజకీయ కారణాలతో జైల్లో పెట్టారని అలా చేసిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని ఆమె సవాల్ చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎవరికి సవాల్ చేస్తున్నారో చెప్పే ధైర్యం చేయలేకపోయారు.
రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి అరెస్టు చేసినప్పుడు ఆయన కేసీఆర్కు నేరుగా సవాల్ చేశారు. ఇలాంటి సవాళ్లు …ప్రత్యర్థులు ఎవరో తెలుసుకుని ధైర్యంగా వారి పేరుతో సవాల్ చేస్తారు. కానీ కవిత తనను బీజేపీ జైల్లో పెట్టిందని మాత్రం చెప్పలేకపోయారు. కానీ భీకరమైన డైలాగులు మాత్రం చెప్పారు. ఆప్ నేతలు నెలల తరబడి జైల్లో మగ్గిపోయినా… ఇలాంటి ప్రకటనలు చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయం ఉందో లేదో…ఒక వేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీనే చేసి ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. దర్యాప్తు సంస్థలు ఆ పార్టీ అధీనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే… బీజేపీ మీద తీర్చుకోవాలి. ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. వీలైనంత వరకూ లో ప్రోఫైల్ రాజకీయం చేయడం బెటర్. కానీ.. ఇలాంటి సవాళ్లు చేసి ప్రత్యర్థి పేరు ఎత్తడానికి కూడా భయపడితే సమస్య అవుతుంది.
కవితే కాదు.. బీఆర్ఎస్ నుంచి ఎవరూ బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎప్పటికైనా మారుతుందా లేదా అన్నది మాత్రం కాలమే తేల్చాలి !