త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. మరోపక్క, ఆ జిల్లాతోపాటు తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో తెరాస నాయకురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఏం చేస్తున్నారనేది తెరాస వర్గాల్లో కూడా కొంత చర్చనీయంగా మారింది. జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతుంటే, ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని తెరాస ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగానే సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నారనీ, అందరినీ నడిపించాల్సిన మాజీ ఎంపీ కవిత పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కిందిస్థాయిలో తెరాస కేడర్ వాపోతున్నట్టు సమాచారం.
గడచిన లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన కవిత, ఆ పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తరువాత… ఒక్కసారి మాత్రమే జిల్లాకి వచ్చారనీ, ఓ కార్యకర్త మరణిస్తే పరామర్శకు మాత్రమే వచ్చివెళ్లారనీ, ఆ తరువాత ఇటువైపు రాలేదని కార్యకర్తలు అంటున్నారు. అయితే, జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పటికీ… ఆయన నాయకత్వంలో పార్టీ నడిచేందుకు ఎమ్మెల్యేల నుంచి సరైన సహకారం అందడం లేదట! దీంతో ఆయన ముందుండి నిర్వహించే పార్టీ కార్యక్రమాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. మంత్రి వెర్సెస్ ఇతర తెరాస ఎమ్మెల్యేలు అన్నట్టుగా గ్రూపులు ఏర్పడ్డాయనీ, దీంతో క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయంలో ఉందని తెలుస్తోంది.
ఈ పరిస్థితికి కారణం మాజీ ఎంపీ కవిత క్రియాశీలంగా వ్యవహరించకపోవడం అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. జిల్లాలో డీఎస్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆయన సాంకేతికంగా తెరాసలోనే ఉన్నారు. కానీ, త్వరలో భాజపా గూటికి చేరడం ఖాయం. ఆయన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని నిజామాబాద్ లో మరింత బలపడే ప్రయత్నం చేయాలనేది భాజపా లక్ష్యం. కాబట్టి, ఇప్పటికైనా కవిత స్పందించకపోతే, జిల్లా కేడర్ పై దృష్టి పెట్టకపోతే… భాజపాకి ఇదో ప్లస్ అవుతుందని తెరాస వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా నిజామాబాద్ మీద కవిత ప్రత్యేక శ్రద్ధ పెడతారా..?