క్రెడిట్ కోసం ఆరాటపడని రాజకీయ నాయకులంటూ ఎవ్వరూ ఉండరు! ప్రజలకు ఉపయోగపడే ఏ చిన్న పనిచేసినా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకుంటారు. అంతా తామే చేశామనీ, తమ కృషి ఫలితంగానే పనులు జరుగుతున్నాయని గొప్పగా చెప్పుకుంటారు. చేసిన పనికీ, లేదా జరిగిన పనికీ క్రెడిట్ దక్కకపోతున్న పరిస్థితి ఉందీ అనుకుంటే.. వెంటనే రంగంలోకి దిగేసి ప్రచార పర్వానికి తెర లేపేస్తారు. నిజామాబాద్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఇలానే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని చెప్పాలి!
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను ఏర్పాటు అంశం కొన్ని దశాబ్దాలుగా నానుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడిప్పుడే ఈ పనుల్లో కదలిక కనిపిస్తోంది. చాలావరకూ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దశలవారీగా లైన్ల నిర్మాణం జోరుగానే సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా లింగంపేట నుంచి మోర్తాడు వరకూ కొత్త రైలును ప్రారంభించారు. ఈ రైలుకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు, మరో కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎంపీ కవిత… ఈ ముగ్గురూ ఢిల్లీ నుంచి జెండా ఊపారు. రాజధానిలో పచ్చజెండా ఊపితే తెలంగాణలో ఈ రైలు ప్రయాణం మొదలైంది. ఇక్కడి నుంచే క్రెడిట్ గేమ్ ప్రారంభమైంది. ఇదంతా కేంద్రంలోని భాజపా సర్కారు సాధించిన ఘనతా చెప్పుకోవడం షురూ చేశాయి రాష్ట్ర భాజపా శ్రేణులు. రైలు సర్వీసులు ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు స్టేషన్ల వద్దకు చేరుకుని భాజపాకి జిందాబాద్‌లు కొట్టారు.
అయితే, వెంటనే అప్రమత్తమైన ఎంపీ కవిత తన అనుచరులను అప్రమత్తం చేశారు! నిజానికి, గడచిన ఎన్నికల్లో ఈ రైల్వే లైను ఏర్పాటు చేస్తామంటూ భాజపాతోపాటు, తెరాస కూడా హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారమే ఈ పనులన్నీ ఎంపీ కవిత వల్లనే సాధ్యమయ్యాయనే ప్రచారానికి తెరాస కూడా సిద్ధమైంది. ఎప్పుడైతే భాజపా శ్రేణులు ఈ రైల్వే స్టేషన్లలో హడావుడి చేయడం సిద్ధమయ్యాయో.. ఆ వెంటనే తెరాస కార్యకర్తలు కూడా గులాబీ జెండాలతో స్టేషన్లకు చేరుకున్నారు. ఎంపీ కవితతోపాటు తెరాసకు జిందాబాద్ కొట్టడం మొదలుపెట్టారు.
ఈ రైల్వే లైను పూర్తి చేస్తున్నది కేంద్రమే అని భాజపా కార్యకర్తలు నినాదాలు చేస్తే.. ఈ ఘనత అంతా తెరాసకు దక్కుతుంది గులాబీ దళమూ నినదించింది. రెండు పార్టీల నినాదాలనూ క్రెడిట్ కోసం పడుతున్న ఆరాటాలనూ చూస్తూ మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ప్రజలది. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం పాలకుల బాధ్యత. అంతేగానీ, రాజకీయ పార్టీల క్రెడిట్ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయరు కదా! అధికార పార్టీకీ ప్రభుత్వానికీ మధ్య ఉన్న తేడాను పాలకులే మరిచిపోతే ఇలానే ఉంటుంది.