ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధికారం పోయినప్పటి నుంచి బీసీల గురించి బాధపడిపోతున్నారు. బీసీల పడిపోతున్న బాధల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి అదే పనిగా బీసీల గురించి డిమాండ్లు చేస్తున్నారు. తాజాగా బడ్జెట్లో బీసీలకు ఇరవై వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు లేఖ కూడా రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.ద ఇటీవల ఆమె పూలే విగ్రహం గురించి ఎక్కవగా రాజకీయాలు చేస్తున్నారు.
అది కంటిన్యూ చేస్తూనే కొత్తగా బీసీ నిధుల గురించి మాట్లాడటం ప్రారంభించారు. బీఆర్ఎస్లో ఓ బీసీ నేతతో ఇలాంటి డిమాండ్లు చేయించినా ఓ ఆర్థం ఉంటుందేమో కానీ..ఇలా కవితతో బీసీ ఉద్యమం నడిపించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందన్న సెటైర్లు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్నాయి.