హైదరాబాద్: నిజామాబాద్ నగరానికి 1,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేసినందుకు స్థానిక ఎంపీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ హైదరాబాద్లో సచివాలయంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ నగరం కాంగ్రెస్ పాలనలో భ్రష్టుపట్టిందని అన్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు పనులు నెలరోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇళ్ళ కేటాయింపు వంటి విషయాల్లో ఏపీకి ప్రాధాన్యమిస్తూ, తెలంగాణను చిన్నచూపు చూస్తోందని అన్నారు. తెలంగాణకు పదివేల ఇళ్ళను, ఏపీకి లక్షా 93 వేల ఇళ్ళు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పారు. ప్రధాని మోడిపై కూడా విమర్శలు గుప్పించారు. ఆయన సమాఖ్య స్ఫూర్తిని విస్మరించారని ఆరోపించారు. కవిత ఎన్నికల ఖర్చులో తప్పుడు లెక్కలు చూపిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ రాసిన కథనాన్ని ప్రస్తావించగా, అది ఆంధ్రజ్యోతి కాదని, ఆంధ్రుల జ్యోతి, అబద్ధాల జ్యోతి, అసత్యాల జ్యోతి అన్నారు. అది చంద్రబాబు కరపత్రంలాగా పనిచేస్తోందని విమర్శించారు. ఆ పత్రికను బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారుల నోటీస్ అందిందా అని అడగగా, తనకు నోటీస్ ఏమీ అందలేదంటూ విలేకరులపై విసుక్కున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో తాను ఏమైనా తప్పుచేసినట్లు భావిస్తే తాను వారికి సమాధానం చెబుతానని, లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. తమ సంస్థ తెలంగాణ జాగృతి మీడియా సమావేశాలకు ఇవాళ్టినుంచి ఆంధ్రజ్యోతి పత్రికనుగానీ, వారి ఛానల్నుగానీ పిలవకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్లో తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, ముఖ్యమంత్రి అక్కడ మూడు రోజులు మకాంవేసి పేదలకు ఇళ్ళు ఇచ్చారని, 2,000 ఎకరాలలో టెక్స్టైల్ పార్క్ పెట్టాలని కేసీఆర్ తలపెట్టారని, వరంగల్ పట్టణాభివృద్ధికోసం రు.2,000 కోట్లు కేటాయించాలని అనుకుంటున్నారని చెప్పారు.