తెలంగాణ మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఖాయమని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ మార్పు చేర్పుల కన్నా.. ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన కల్వకుంట్ల కవితను మంత్రివర్గంలోకి తీసుకోవడంపైనే. ఆమె ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు చిట్ చాట్‌గా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఎప్పుడూ చిరు నవ్వుతో.. సమాధానం చెప్పుకుండా లైట్ తీసుకునే కవిత.. కరీంనగర్లో మాత్రం… ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు. కేబినెట్లో ఎప్పుడు చేరుతున్నారంటూ.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు.. ఎదురు ప్రశ్నలు వేసి.. అంతిమంగా.., తాను కేబినెట్లో చేరడం ఖాయమన్న సంకేతాలు పంపేశారు.
కొత్త ఏడాదిలో మంత్రివర్గంలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే… ఇంగ్లిష్ న్యూఇయరా.. ఉగాదా.. అని ఎదురు ప్రశ్నించారు. అయితే సంక్రాంతికి ముందే మంత్రిగా మారతారా అంటే ఉగాది వరకూ ఆగాలా అని మరో ఎదురు ప్రశ్న వేశారు. మంత్రి పదవి గురించిప్రస్తావన వస్తే.. ముందుగా ఖండిస్తే పెద్దగా ఉహాగానాలు వచ్చేవి కావు. కానీ ముందుగానే మంత్రి పదవి చేపడతానన్నట్లుగా మాట్లాడటంతో.. ఈ విషయంలో ఆమెకు క్లారిటీ ఉందన్న చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. కేసీఆర్ కుమార్తె అయిన కవితను.. సాధారణ ఎమ్మెల్సీగా ఉంచేందుకు ఇష్టపడరని. మరో ఉన్నతమైన పదవికి అప్పగించేందుకే ఎమ్మెల్సీ చేశారన్న చర్చ కొంత కాలంగా ఉంది. ఆ ఉన్నతమైన పదవి మంత్రి పదవేనని ఇప్పుడుక్లారిటీ వస్తోంది.
గ్రేటర్ ఎన్నికల తర్వాత గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఉన్నాయి. అవి అయిపోగానే.. కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరిస్థితుల్ని బట్టి.. కేటీఆర్‌కు పగ్గాలిచ్చి ఆయన జాతీయ రాజకీయాలవైపు చూసే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా,.. దేశానికి కొత్త రాజకీయ దిశానిర్దేశం కావాలని.. అది తానే చేయవచ్చని కూడాచెప్పారు. ఈ నెల రెండో వారంలో బీజేపీయేతర పార్టీల భేటీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎలా చూసినా.. మంత్రివర్గంలో కీలకమైన మార్పులు … అలాగే కవితకు మంత్రి పదవి ఖాయమన్న క్లారిటీ మాత్రం రాజకీయవర్గాలకు వస్తోంది.