ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత 9 ఫోన్లను మార్చారని చేశారని … డిల్స్ మాట్లాడుకున్న ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఆమె స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని వాటిని నేరుగా తీసుకెళ్లి ఈడీకి ఇచ్చారు. ఇలా ఇవ్వడానికి వెళ్లే ముందు ఇంటి దగ్గర.. ఆఫీసు దగ్గర వాటిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. మామూలుగా మీడియా సమావేశం పెట్టి.. తన వాదన చెప్పాలనుకున్నారు కానీ అది కరెక్ట్ కాదనుకుని విచారణ అధికారికి ఓ లేఖ రాసి దాన్ని మీడియాకు లీక్ చేశారు.
దర్యాప్తు అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాననని… ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించదా?. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని ఆమె ఆరోపించారు. లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’’ అని లేఖలో కవిత పేర్కొన్నారు. అంటే ఈడీ తప్పు చేస్తోందని చెబుతూ తానేం తప్పు చేయలేదని నిరూపించడానికే.. ఫోన్లను ఈడీకి సమర్పిస్తున్నానని కవరేజీ వచ్చేలా కవిత వ్యూహం అవలంభించారు.
అయితే ఈడీ ఎక్కడైనా మీడియాకు లీకులు ఇచ్చిందో లేదో ఎవరికీ తెలియదు. కవిత ఫోన్లను మార్చారని , ఆధారాలను ధ్వంసం చేశారని చార్జిషీట్లలో పేర్కొన్నారు. ఈడీ ఆరోపణలను కవిత నిజం చేశారు. 9 ఫోన్లను మార్చారని స్పష్టమైంది. ఇప్పుడు వాటిలో ఆధారాలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే.. చాలా స్వల్ప వ్యవధిలో ఇన్ని ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న ఓ సందేహం ఎవరికైనా వస్తుంది. సాధారణంగా రహస్య వ్యవహారాలు చేసేవాళ్లే ఇలా మారుస్తారని అంటున్నారు. కారణం ఏదైనా కవిత ఫోన్ల ప్రదర్శన బూమరాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.