ఆరు నెలల కిందట ఢిల్లీలిక్కర్ స్కాం గురించి సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు అసలు సీబీఐ కాకుండా బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడారు. మొదట సిసోడియాను. … తర్వాత కవితను టార్గెట్ చేశారు. అసలు లిక్కర్ స్కాం ఢిల్లీది కాబట్టి సిసోడియా పేరు వినిపించిందని అనుకోవచ్చు. కానీ కవితకేం సంబంధం ? కానీ అప్పట్లో ఢిల్లీ బీజేపీ నేతలుకూడా తామే దర్యాప్తు పూర్తి చేసేశామన్నట్లుగా ప్రకటనలు చేశారు. లిక్కర్ క్వీన్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేశారు. అప్పట్లోనే ఇది రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు సైడ్ అయిపోయారు. దర్యాప్తు సంస్థలు మెల్లగా పని మొదలు పెట్టాయి.
అప్పట్నుంచి ఇప్పటి వరకూ కవిత పేరును ప్రతీ రిమాండ్ రిపోర్టు.. చార్జిషీటులో చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఆమెను నిందితురాలిగా చేర్చలేదు. ఓ సందర్భంలో కోర్టుతోనే ఆమెపై సాక్ష్యాలున్నాయని చెప్పించేలా చేశారు. ఎప్పటికప్పుడు అరెస్ట్ అనే లీకులు ఇస్తూనే ఉన్నారు. ముందుగా కవితకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి.. వారిని అప్రూవర్లుగా మార్చడమో… తిరుగులేని సాక్ష్యాలను సేకరించడమో చేశారు. కవిత మాజీ పీఏ అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ముగ్గురూ కవితకు బినామీలేనని ఈడీ చెబుతోంది. ఏ ఆధారాలు లేకుండా ఇలా ఏకపక్షంగా కోర్టులో ప్రకటించడానికి అవకాశం ఉండదు.
ఈ మొత్తం వ్యవహారంలో నగదు బదిలీ అయిన ఖాతాలు ఇతర వ్యవహారాలను ఈడీ, సీబీఐ పక్కాగా రెడీ చేసుకున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎక్కడా తొందరపడటం లేదు. ఈ కేసు మొదట బయటపడినప్పుడు అంతా రాజకీయ కుట్ర అనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా చేస్తున్న అరెస్టులు.. కోర్టుల ముందు చెబుతున్న విషయాలతో నిజంగానే స్కాం జరిగిందన్న అభిప్రాయాన్ని జనాల్లోనూ కల్పించగలిగారు. మొదట లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం అని వాదించిన కవిత.. కేంద్రంపై పోరాడుతున్నందునే కేసులు పెడుతున్నారని వాదించడం ప్రారంభించారు.
కవిత అరెస్ట్ ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఈ కేసులో కవితకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆమె కార్నర్ అవుతున్నారు. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత అరెస్ట్ కావడం. .. అదీ ఓ ముఖ్యమంత్రి కుమార్తె కావడం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తమపై రాజకీయ ఒత్తిడి లేదని నిరూపించడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు కవిత చేతుల్లోనే ఉంది.