గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. దానికి కారణంగా ఆమె ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమెకు ఆ నియోజకవర్గ పరిధిలోని బోధన్ నియోజకవర్గంలో ఓటు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ్నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆమె ఓటు వేయడంతో వివాదం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ నేతలు.. ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ ఎన్నికల సంఘం వరకూ వెళ్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని సీఈసీకి తెలంగాణ బీజేపీ అధికారికంగా లేఖ పంపింది.
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారని… రెండు చోట్ల వినియోగించుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. హైదరాబాద్లో కవితకు ఓటు హక్కు ఉందన్న రికార్డుల్ని కూడా.. ఫిర్యాదుతో పాటు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పందించే అవకాశం లేదు. సీఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది కాబట్టి.. అక్కడ్నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి. నిజానికి చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటుంది. కానీ ఒకటో వినియోగించుకుంటే ఇంకో చోట వినియోగించుకోరు. గతంలో కేసీఆర్ కు కూడా రెండు చోట్ల ఓటు ఉన్న విషయం బయటపడింది.
కానీ ఆయన ఒక్క చోటే వినియోగించుకోవడంతో పెద్దగా వివాదాస్పదం కాలేదు. కానీ ఇక్కడ కవిత మాత్రం.. ఇబ్బందుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి కేటీఆర్ కూడా.. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఓటు వేస్తారు. ఆయన కూడా.. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేశారు. సిరిసిల్ల నుంచి ఆయన హైదరాబాద్కు ఓటు మార్పించుకున్నారేమో క్లారిటీ లేదు. అయితే.. కవిత అంశాన్ని మాత్రం.. బీజేపీ హైలెట్ చేస్తోంది.