హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రైతుల ఆత్మహత్యలు. రోజుకు 10 – 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ పిట్టలలాగా రాలిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రు.1.5 లక్షలనుంచి రు.6 లక్షలకు పెంచుతూ గత శనివారం తీసుకున్న నిర్ణయం తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఈ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కాంక్రీట్‌గా తీసుకున్న చర్యలేమీ లేవు. అయితే ఈ విషయంలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత చొరవను అభినందించకుండా ఉండలేము. ఎంత గొప్ప పనైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లు రైతుల ఆత్మహత్యల విషయంలో కవిత తనవంతుగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందరి ప్రశంశలూ అందుకుంటున్నారు. తన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా క్రీడాకారులు, ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులను కూడగట్టి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను దత్తత తీసుకునేలా చేస్తున్నారు. ఆమె పిలుపుకు స్పందించి బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జ్వాల రు.లక్ష, ఓఝా రు.2 లక్షలు, సానియా రు.3 లక్షల చొప్పున చెక్కులను కవితకు అందించారు. రైతు చనిపోతే ఆ కుటుంబం బాధ్యతంతా భార్యపై పడుతుందని, పిల్లల చదువు భారంగా మారుతుందని, అందుకే కుటుంబాలను ఆదుకునేందుకు జాగృతి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని కవిత చెప్పారు. దీనికోసం ప్రొ.శ్రీధర్ కన్వీనర్‌గా, దేవీప్రసాద్, ప్రొ.కోదండరామ్, విజయబాబు తదితరులు సలహాదారులుగా కమిటీని ఏర్పాటుచేశామన్నారు. తమ పిలుపు మేరకు రైతు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అమెరికా, లండన్, బహ్రైన్ తదితర దేశాలకు చెందిన 80మంది ముందుకొచ్చారని చెప్పారు. జాగృతి అందించే విరాళాలను నవంబర్ 1వ తేదీన బాధిత కుటుంబాలకు అందిస్తామని చెప్పారు.
ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం మేలుకుని, చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవటంకాకుండా సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆత్మహత్యల నివారణకు ఒక సమగ్ర కార్యక్రమం చేపట్టాలి. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులను అధ్యయనం చేయించి, వీటిని నివారించటానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. నీళ్ళకోసం బోర్ వేయటం, ఒకదానిలో పడకపోతే మరొకటి, దానిలో పడకపోతే మరొకటి వేసుకుంటూ పోవటం ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోవైపు బోర్లు వేసేముందు నిపుణుల సలహాలు తీసుకోవటంలేదనికూడా తెలుస్తోంది. రుణమాఫీ సరిగా అమలుకాకపోవటం మరో ప్రధాన కారణం. రైతుల రుణాలను వెంటనే ప్రభుత్వ రుణాలుగా ప్రకటించటమే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఈ మహా వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోటానికి ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయినుంచి రాష్ట్రస్థాయివరకు ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఇలాంటి చర్యలు తీసుకోకపోతే కేసీఆర్ ప్రభుత్వం మరింత వ్యతిరేకత మూటగట్టుకోక తప్పదు.