ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులు గడిచే కొద్దీ తన పాత్రపై ఒక్కొక్క విషయాన్ని సీబీఐ, ఈడీ బయట పెడుతూండటంతో కవిత తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు. తనకు పరిచయం ఉన్న మీడియా సంస్థలు, ప్రభుత్వం , టీఆర్ఎస్ తరపున భారీగా ప్రకటనలు ఇస్తున్న మీడియా సంస్థల యాజమాన్యంతో నేరుగా టచ్ లో కి వెళ్లి.. తనపై వార్తల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు ఎవరైనా తనపై విమర్శలు చేస్తే.. ఏ మాత్రం ఆగకుండా కౌంటర్ ఇస్తున్నారు.
ఉదయం రాజగోపాల్ రెడ్డి లిక్వర్ క్వీన్ అని సంబోధిస్తూ.. ట్వీట్ చేశారు. దీనిపై కవిత.. మర్యాదగానే మాట జారకు అన్నా అని కాస్త ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. నిజం నిప్పులాంటిదని.. జైలుకెళ్లక తప్పదన్నారు. తనను మునుగోడు ఎన్నికల సమయంలో వేధించారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా విమర్శలు గుప్పించారు. ఆయనకూ కవిత రిప్లయ్ ఇచ్చారు. బీఆర్ఎస్ .. ఎక్కడ బీజేపీ పుట్టి ముంచుతుందోననే బయంతోనే తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు.
మరో వైపు కవిత ఈడీ చార్జిషీటు అంశంపై సీఎం కేసీఆర్ మరోసారి ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. న్యాయనిపుణులతోనూ మాట్లాడారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితనే అసలైన వాటాదారు అని ఈడీ గట్టిగా చెప్పడంతో… ఎలా ఈ పరిస్థితిని అధిగమించాలన్నదానిపై న్యాయనిపుణులు మేధోమథనం జరుపుతున్నారు. త్వరలో ఈడీ కవితను విచారించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో రాజకీయంగా కవిత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే బీజేపీపై ఆరోపణలు ..ఎదురుదాడి చేయడానికే అవకాశం ఉంది. ఎలా చూసినా ఈ పరిణామాలతో కవిత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.