ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే… హైదరాబాద్లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు తో పాటు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని లేఖ రాశారు. తనకు నోటీసు ఇచ్చిన సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.
సీబీఐ నుంచి తనకు నోటీసు అందిందని స్వయంగా కవితనే ప్రకటించారు. శనివారం ఉదయం ప్రగతి భవన్కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్తో తనకు వచ్చిన నోటీసులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులతోనూ కేసీఆర్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు కవిత లేఖ రాశారు .. సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.
అయితే సీబీఐ ఇలా వివరణ కోసం వచ్చినప్పుడు… ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకు వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే.. విచారణకు హాజరయ్యేందుకు.. తన తరపున క్లారిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ఆ వ్యూహంతోనే ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహమే అమలు చేస్తో ఆరో తేదీన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.