కల్వకుంట్ల కవితకు మద్యం వివాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన ఆమెకు ఇప్పుడు కేరళ లిక్కర్ రాజకీయంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. ఓయాసిస్ అనే కంపెనీ పెట్టిన మద్యం తయారీ ప్లాంట్ల వెనుక కవిత ఉన్నారని కేరళలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సతీశన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆయన కేరళలో మీడియాతో మాట్లాడారు. పాలక్కాడ్ లో ఏర్పాటు చేసిన మద్యం తయారీ ప్లాంట్ కోసం కవిత చాలా సార్లు కేరళ వచ్చారని..ఇదంతా కమ్యూనిస్టు పార్టీ పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు.
కవిత స్వయంగా కేరళకు వెళ్లి అక్కడి లిక్కర్ ప్లాంట్ల కోసం.. ఓ కంపెనీ కోసం లాబీయింగ్ చేశారని ఆరోపించడం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు.. తెలంగాణ రాజకీయంతో సంబంధం లేదు. టార్గెట్ చేసుకుని మరీ కవిత పేరును వెల్లడించాల్సిన అవసరం లేదు.అక్కడ ప్రతిపక్ష నేతకు స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఒయాసిస్ కంపెనీ ఎవరిది.. కేరళలో లిక్కర్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు ఎలా .. ఎవరిచ్చారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
మరో వైపు ఈ ఆరోపణల్ని కవిత తీవ్రంగా ఖండించారు. మహిళా నేతలపై ఇలా బురద చల్లడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారని బీజేపీపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ , కవితలకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం ఇబ్బందికరమే.