మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపనున్నారు.
పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. పార్లమెంటు బయట బిల్లుకు మద్దతు కూడగట్టడం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు పార్లమెంటు లోపల కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు, జీరో అవర్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పార్లమెంటు బయట ఎలా కొట్లాడాలో రైతులు తమకు మార్గం చూపించారని గతంలో కవిత ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మహిళలు చేసే పోరాటానికి ప్రతి పార్టీ, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులు వస్తాయని తెలిసినప్పుడల్లా ఈ ఉద్యమం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తాము ఈ ఉద్యమం చేస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని కవిత అంటున్నారు. కారణం ఏదైనా కవితను మూడు రోజుల విచారణ తర్వాత మళ్లీ ఎప్పుడు పిలుస్తారన్నదానిపై క్లారిటీలేదు. కానీ… ఖచ్చితంగా పిలుస్తారని భావిస్తున్నారు. అందుకే … మహిళా రిజర్వేషన్ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతోందని అంటున్నారు.