ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నారు. సౌత్ లాబీలో కీలకమైన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీ మార్చి మార్చి అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇక మిగిలింది అరుణ్ రామచంద్ర పిళ్లై, కల్వకుంట్ల కవిత మాత్రమే. అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టి కవిత ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేశారని చార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆ ప్రకారం తర్వాత వీరే టార్గెట్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.
నిజానికి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఎప్పుడో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సీబీఐ ప్లాన్ మార్చింది. ఆయనను అరెస్ట్ చేయడం లేదు. కానీ ఆయన అప్రూవర్ గా మారబోతున్నారన్న లీకులు వచ్చాయి. ఇది సంచలనం అవుతోంది. నిజంగానే అరుణ్ రామచంద్ర ఫిళ్లై అప్రూవర్ గా మారితే… తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయి. ప్రధానంగా కవిత ఇరుక్కుపోతారని అంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ ముందు ముందు తీసుకునే నిర్ణయాలు అందిరలో ఉత్కంఠ రేపుతున్నాయి.
ఇప్పటికే సీబీఐ ఓ సారి కవితను ప్రశ్నించారు. అదే సమయంలో పిలిచినప్పుడు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ మళ్లీ ఇంత వరకూ పిలువలేదు. ఇప్పుడు పిలిచే సమయం దగ్గర పడిందని చెబుతున్నారు. ఈ సారి విచారణకు సీబీఐ వాళ్లు రారు… కవితే వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు . అదే జరిగితే…. అరెస్టుకూ చాన్స్ ఉంది. ఇటీవల అరెస్టులన్నీ విచారణకు పిలిచే చేస్తున్నారు.