లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాజకీయం చేస్తే కవిత తమ పార్టీ రంగు అయిన పింక్ బుక్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. మా నాన్న మంచోడు..నేను మూర్ఖుడినని లోకేష్ ప్రకటించుకుంటే.. కవిత కూడా మా నాన్న మంచోడు కానీ నేను రౌడీని అని హెచ్చరిస్తున్నారు. లోకేష్ స్టైల్ కవితకు నచ్చిందేమో కానీ ఫాలో అయిపోతున్నారు. కవిత దూకుడు చూస్తూంటే.. లోకేష్ చేసినట్లుగా పాదయాత్ర కూడా చేస్తారేమోనని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలేదు. ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. కానీ ఆరు నెలల ముందు నుంచే.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దారిలో ఉంది. రోజూ ఏదో ఓ కొత్త ఆరోపణతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కూడా మళ్లీ గెలవడానికి ఏం చేయాలో అది చేయండని ఎమ్మెల్యేలకు చెబుతోంది. ఇలాంటి క్రమంలో.. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో చురుకుదనం తేవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
కవిత తమ పార్టీ నేతలకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం చెప్పడానికి… కాంగ్రెస్ నేతలను బెదిరించడానికి లోకేష్ చూపిన మార్గాన్ని ఎంచుకున్నారు. పింక్ బుక్ పేరుతో ఇప్పటికే హెచ్చరికలు ప్రారంభించారు. తానేమీ ఆషామాషీగా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఎవర్నీ సహించలేది లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాను కూడా రౌడీనే అని ప్రకటించుకున్నారు. కవిత ప్రకటన వైరల్ గా మారింది. బీఆర్ఎస్ సభకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు వస్తున్నాయని పార్టీ నేతలు ఆమెకు చెప్పడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ తరహా రాజకీయం చేస్తున్న కవిత.. పాదయాత్ర ఆలోచన కూడా చేస్తే బీఆర్ఎస్ నేతల్లో హుషారు వస్తుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అందుకే కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకూ అంటే తనకు బాధ్యత ఇచ్చిన జిల్లా వరకూ పాదయాత్ర చేసే ఆలోచన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.